పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:16 AM
నగరంలో పాల విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రత, నియంత్రణ (ఫుడ్ సేఫ్టీ) అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతుల నుంచి నేరుగా పాలను సేకరించి ప్రజలకు విక్రయిస్తున్న కేంద్రాలపై ప్రధానంగా దృష్టిసారించారు. రాజమండ్రిలో పాల కల్తీ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
అక్కడికక్కడే కొన్ని పరీక్షలు
మరికొన్నింటి కోసం నమూనాలు సేకరించి
స్టేట్ ల్యాబ్‌కు పంపిన
ఆహార భద్రత, నియంత్రణ అధికారులు
రాజమండ్రి ఉదంతం నేపథ్యంలో
ప్రభుత్వం అప్రమత్తం
విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పాల విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రత, నియంత్రణ (ఫుడ్ సేఫ్టీ) అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతుల నుంచి నేరుగా పాలను సేకరించి ప్రజలకు విక్రయిస్తున్న కేంద్రాలపై ప్రధానంగా దృష్టిసారించారు. రాజమండ్రిలో పాల కల్తీ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు అక్కయ్యపాలెం 80 ఫీట్‌రోడ్డులోని డైరెక్ట్ ఫారం మిల్క్, కృషి డెయిరీఫారం, సీతమ్మధారలోని ఆంథోనీ డెయిరీ, శివాజీపాలెంలోని రబ్బాని మిల్క్ ఫుడ్, రామాటాకీస్ సమీపంలోని భారతి మిల్క్‌ఫుడ్ కేంద్రాల్లో తనిఖీలు చేసారు. పాలలో నీటి కల్తీ, పీహెచ్ స్థాయిని తెలియజేసే కొన్ని పరీక్షలను అక్కడికక్కడే చేశారు. పాలలో కొవ్వుశాతం, శాలిడ్స్ నాట్ ఫాట్ (ఎస్‌ఎన్‌ఎఫ్) శాతం, షుగర్, యూరియా, గంజి, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి ఏమైనా ఉన్నాయా అనేదానిని గుర్తించేందుకు నమూనాలను తీసి స్టేట్ ల్యాబ్‌కు పంపించారు. ఏమైనా కల్తీ జరిగినట్టుగానీ, ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నాణ్యత లేని పాలను విక్రయిస్తున్నట్టుగానీ తేలితే బాధ్యులైన వారిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఫుడ్‌సేఫ్టీ అధికారులు కళ్యాణచక్రవర్తి, జీవీ అప్పారావు పాల్గొన్నారు.