హోటళ్లలో తనిఖీలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 01:07 AM
హోటళ్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ హెచ్చరించారు.
పరిశుభ్రత, ఆహార నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ హెచ్చరిక
గత వారం 35 హోటళ్లకు జరిమానా
విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
హోటళ్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ హెచ్చరించారు. నిల్వ ఆహారాన్ని వడ్డిస్తున్నారని, కిచెన్‌లో పారిశుధ్య నిర్వహణ ఘోరంగా ఉంటుందని ఫిర్యాదులు వస్తుండడంతో హోటళ్లపై దృష్టిసారించామన్నారు. ఈట్ రైట్ ప్రచారంలో భాగంగా ఇప్పటికే జోన్‌కు రెండు చొప్పున ఏర్పాటుచేసిన షీ టీమ్స్ సిబ్బందిని హోటళ్లలో తనిఖీలు చేయాలని ఆదేశించామన్నారు. గత వారం రోజుల్లో పది జోన్ల పరిధిలో 20 బృందాలు 98 హోటళ్లలో తనిఖీ నిర్వహించాయని, 35 హోటళ్లలో ఆహార నాణ్యత సరిగా లేదని గుర్తించి రూ.77,500 జరిమానా విధించడం జరిగిందన్నారు. అందులో 18 హోటళ్లకు నోటీసులు జారీచేశామన్నారు. అదేవిధంగా సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తున్నందుకు 33 హోటళ్లకు నోటీసులు జారీచేశామన్నారు. వ్యాపారులు లాభాపేక్షతో ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించేలా నాశిరకం ముడిపదార్థాలు, హానికరమైన రంగులు వినియోగించడం, నిల్వ ఆహారాన్ని అప్పటికప్పుడు వేడి చేసి వడ్డించడం సరికాదన్నారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా చేయడంతోపాటు వ్యాపారులకు ప్రజారోగ్యం పట్ల బాధ్యత పెంచడమే తమ లక్ష్యమన్నారు. ఇకపై కూడా హోటళ్లలో తనిఖీలు కొనసాగిస్తామని, ‘సురక్షిత ఆహారం-ఆరోగ్యవంతమైన ప్రజలు-పరిశుభ్రమైన ప్లాస్టిక్ రహిత విశాఖ’ లక్ష్య సాధనకు అందరూ కలిసిరావాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా కేతన్ గార్గ్ బాధ్యతల స్వీకారం
విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మెట్రోపాలిటన్ కమిషనర్‌గా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. కొత్త కమిషనర్‌గా నియమితులైన ప్రఖర్ జైన్ విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి విధుల్లో చేరేంత వరకు అదనపు బాధ్యతల కింద కేతన్ గార్గ్ పనిచేయాలని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన శనివారం వీఎంఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.
ఎర్రాజీ జ్యోతి ఖాతాలో మరో పతకం
ఆసియా క్రీడలకు అర్హత
విశాఖపట్నం స్పోర్ట్స్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
నగరానికి చెందిన ఒలింపియన్ ఎర్రాజీ జ్యోతి ఖాతాలో మరో అంతర్జాతీయ పతకం చేరింది. భువనేశ్వర్‌లో శనివారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ సిల్వర్ మీట్ టోర్నీలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి కాంస్య పతకం సాధించింది. త్వరలో జరగనున్న ఆసియా క్రీడలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఎర్రాజీ జ్యోతిని ‘ద ఒలింపిక్ సంఘం’ చీఫ్ ప్యాట్రన్, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డి.నాగేశ్వరరావు, ఎం.నారాయణరావు, ఇతర ప్రతినిధులు అభినందించారు. ఆసియా క్రీడల్లో దేశానికి పతకం అందించాలని ఆకాంక్షించారు.
అడుగంటిన మేహాద్రిగెడ్డ రిజర్వాయర్
గోపాలపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
నగర ప్రజల దాహార్తిని తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో నిల్వలు డెడ్ స్టోరేజీకి సమీపంలో ఉన్నాయి. ఆగస్టు నెలాఖరు వస్తున్నా ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్ పూర్తిగా అడుగంటింది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 61 అడుగులు కాగా కనిష్ఠం 44 అడుగులు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి మట్టం 48.3 అడుగులు ఉంది. రోజుకు సుమారు 8 ఎంజీడీ నీటిని రిజర్వాయర్ నుంచి వినియోగిస్తారు. ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో పంపింగ్ చేయడానికి కూడా పూర్తిస్థాయిలో సాధ్యపడడం లేదని సమాచారం. భారీవర్షాలు కురిస్తే తప్ప రిజర్వాయర్ నీటిమట్టం పెరిగే అవకాశం లేదు.