Share News

తనిఖీలు సరే.. పెనాల్టీల మాటేమిటి?

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:38 AM

జిల్లాలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలపై అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ... ఈ సందర్భంగా విధించిన అపరాధ రుసుము వసూళ్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్రమ మైనింగ్‌, అనుమతులకు మించి తవ్వకాలు, అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నామని గనుల శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చెబుతున్నప్పటికీ కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేయడంతో తమ పనైపోయిందని అధికారులు మిన్నకుండిపోతున్నారు. గతంలో విధించిన అపరాధ రుసుములను పూర్తిస్థాయిలో వసూలు చేయకుండా, అక్రమ మైనింగ్‌దారులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తనిఖీలు సరే.. పెనాల్టీల మాటేమిటి?
అనకాపల్లి మండలం రొంగలివానిపాలెంలో అనధికార రాయి క్వారీ

అక్రమ మైనింగ్‌దారుల నుంచి అపరాధ రుసుము వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం

కోర్టులను ఆశ్రయిస్తున్న పలువురు క్వారీల లీజుదారులు

మరికొందరు స్వల్ప మొత్తం చెల్లించి యథావిధిగా మైనింగ్‌

ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలపై అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ... ఈ సందర్భంగా విధించిన అపరాధ రుసుము వసూళ్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్రమ మైనింగ్‌, అనుమతులకు మించి తవ్వకాలు, అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నామని గనుల శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చెబుతున్నప్పటికీ కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేయడంతో తమ పనైపోయిందని అధికారులు మిన్నకుండిపోతున్నారు. గతంలో విధించిన అపరాధ రుసుములను పూర్తిస్థాయిలో వసూలు చేయకుండా, అక్రమ మైనింగ్‌దారులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గనుల శాఖ అధికారిక లెక్కల ప్రకారం అనకాపల్లి, నర్సీపట్నం మైనింగ్‌ డివిజన్‌ల పరిధిలో మొత్తం 225 రోడ్డు మెటల్‌, బిల్డింగ్‌ స్టోన్‌, గ్రావెల్‌ క్వారీలు వున్నాయి. వీటిలో అనకాపల్లి డివిజన్‌లో 150, నర్సీపట్నంలో 75 ఉన్నాయి. దీర్ఘకాలిక లీజు అనుమతులున్న క్వారీల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై 2019-20లో అప్పటి మైనింగ్‌ శాఖ జేడీ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అక్రమ తవ్వకాలు, అనుమతుల ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించారు. ఆయా క్వారీల నిర్వాహకులకు సుమారు రూ.150 కోట్ల వరకు భారీ జరిమానాలు విధించారు. అయితే ఇందులో 10 శాతం మాత్రమే... అంటే సుమారు రూ.15 కోట్లు మాత్రమే వసూలైనట్టు తెలిసింది. అక్రమ మైనింగ్‌పై నోటీసులు అందుకున్న పలువురు లీజుదారులు, మైనింగ్‌ కాంట్రాక్టర్లు అపరాధ రుసుములను చెల్లించకుండా వుండేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో కోర్టుల్లో ఏళ్ల కేసులు పరిష్కారం కాకపోవడంతో అపరాధ రుసుం వసూలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది మాత్రం అధికారులు విధించిన అపరాధ రుసుములో స్వల్ప మొత్తాన్ని మాత్రమే చెల్లించి, మిగిలిన డబ్బులు చెల్లించకుండా యథావిఽధిగా క్వారీలను నిర్వహిస్తున్నారు. గతంలో భారీగా అపరాధ రుసుము విధించిన క్వారీల్లో ఎక్కువ శాతం అనకాపల్లి మండలం మార్టూరు, మామిడిపాలెం, ఊడేరు, సీతానగరం, నర్సీపట్నం డివిజన్‌లో రోలుగుంట, చోడవరం మండలాల్లో వున్నాయి.

జిల్లా మైనింగ్‌ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో వసూలైన అపరాధ రుసుము వివరాలను పరిశీలిస్తే... 2020-21లో రూ.40.72,384, 2021-22లో రూ.1,59,27,568, 2022-23లో రూ.90,71,315, 2023-24లో రూ.71,02,566, 2024-25లో రూ.98,57,237, 2025-26లో రూ.83,98,94, 2026-27లో జూన్‌ వరకు మూడు నెలల కాలానికి రూ.17,47,557 వసూలయ్యాయి. ఇందులో 2021-22లో మాత్రమే అత్యధికంగా రూ.1.59 కోట్లు వసూలయ్యాయి.

నోటీసులతో సరి..

అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ మైనింగ్‌పై అపరాధ రుసుము విధిస్తున్నప్పటికీ వాటి వసూళ్లు మాత్రం మొక్కుబడిగా వున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై భారీగా అపరాధ రుసుము విఽధిస్తున్నప్పటికీ డబ్బులు వసూలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాంబిల్లి మండలం పంచదార్ల ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకందారులకు రూ.4.8 కోట్ల మేర అపరాధ రుసుము విధించారు. ఇంత భారీ మొత్తంలో అపరాధ రుసుము విధించగా.. ఇందులో ఎంత వసూలు చేస్తారన్నది సందేహాస్పదమే. అక్రమ మైనింగ్‌దారులకు నోటీసులు జారీ చేసి అపరాధ రుసుము విధిస్తున్న అధికారులు.. ఆ సొమ్మును నిర్ణిత గడువులోగా వసూలు చేయడంపై దృష్టి పెట్టడం లేదు. నోటీసులు అందుకున్న కొందరు మైనింగ్‌దారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు స్వల్ప మొత్తాన్ని చెల్లించి మైనింగ్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా గనుల శాఖ ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో అక్రమ మైనింగ్‌పై విధించిన అపరాధ రుసుము, ఇంతవరకు జరిగిన వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Aug 26 , 2026 | 12:38 AM