జడ్పీ నామినేషన్ కేంద్రం తనిఖీ
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:24 AM
స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న జడ్పీటీసీ స్థానాల నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు కూర్మనాథ్
హెల్ప్ డెస్క్ పనితీరుపై ఆరా
పాడేరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):
స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న జడ్పీటీసీ స్థానాల నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత నామినేషన్ కేంద్రం ఆవరణలో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సహాయంపై ఆరా తీశారు. ఈక్రమంలో అభ్యర్థులకు, వారికి మద్దతుగా వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలందించాలని ఆయన సూచించారు. అనంతరం నామినేషన్లను స్వీకరించే ప్రాంతాన్ని పరిశీలించి, నామినేషన్ల ప్రక్రియపై రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజతో చర్చించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నదని, ఎటువంటి సమస్యలు తలెత్తలేదని ఆర్వో శ్రీపూజ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల మేరకు అన్ని ప్రక్రియలు జరగాలని ఎన్నికల పరిశీలకుడు కూర్మనాథ్ సూచించారు. ఆయనతో జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు, జిల్లా టూరిజం అధికారి పి.చలపతిరావు, సిబ్బంది ఉన్నారు.