Share News

జేఎస్‌జేబీ ఉపాధి పనుల తనిఖీ

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:24 PM

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన జల్‌ సంచయ్‌ జన్‌ భగీదారి(జేఎస్‌జేబీ) 2.0 పనులను తనిఖీ చేస్తున్నామని జిల్లా పంచాయతీ స్థాయి అధికారి(డీఎల్‌పీవో) పీఎస్‌ కుమార్‌ తెలిపారు.

జేఎస్‌జేబీ ఉపాధి పనుల తనిఖీ
చౌడుపల్లిలో ఖండిత కందకాలు పరిశీలిస్తున్న డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌

జిల్లాలో రూ.10.49 కోట్లతో పనులు

డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌

చింతపల్లి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన జల్‌ సంచయ్‌ జన్‌ భగీదారి(జేఎస్‌జేబీ) 2.0 పనులను తనిఖీ చేస్తున్నామని జిల్లా పంచాయతీ స్థాయి అధికారి(డీఎల్‌పీవో) పీఎస్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని కొమ్మంగి, యర్రబొమ్మలు, చౌడుపల్లి, చింతపల్లి పంచాయతీల పరిధిలో జరిగిన జేఎస్‌జేబీ పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు సహజ జలాలను సంరక్షించేందుకు జేఎస్‌జేబీ 2.0 పథకం ద్వారా ఇంకుడు గుంతలు, నీటి నిల్వ కందకాలు, ఖండిత కందకాలు, ఫారం పాండ్స్‌ నిర్మాణాలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.10.49 కోట్లతో పనులు జరిగాయన్నారు. ఈ పనుల నిర్వహణ, నాణ్యతపై కలెక్టర్‌ నిషాంతి ఆదేశాల మేరకు తనిఖీ చేస్తున్నామన్నారు. మండలంలో ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, తహశీల్దార్‌ మూడు బృందాలుగా ఏర్పడి పనులను తనిఖీ చేస్తున్నామని చెప్పారు. చింతపల్లి మండలంలో పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌లో ఫొటోలు ఆప్‌లోడ్‌ చేయడంలో కొన్ని తేడాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. పనుల తాజా ఫొటోలను ఆప్‌లోడ్‌ చేయాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. నీటి కందకాల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, పంట పొలాలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. చౌడుపల్లి పంచాయతీలో కొంత మంది గిరిజన రైతులు ఫారం పాండ్స్‌లో చేపలను పెంచుకుని ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:24 PM