సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:19 PM
మండలంలోని గన్నెల పీహెచ్‌సీలో సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22న వస్తున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను గురువారం సాయంత్రం ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ పరిశీలించారు.
అధికారులకు సూచనలిచ్చిన ఐటీడీఏ పీవో
అరకులోయ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గన్నెల పీహెచ్‌సీలో సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22న వస్తున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను గురువారం సాయంత్రం ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ పరిశీలించారు. గిరిజన ప్రజలకు అత్యాధునిక డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న సంజీవని ప్రాజెక్టుకు అరకులోయ మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపిక చేశారు. వాస్తవానికి సుంకరమెట్ట పీహెచ్‌సీని పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. అయితే అన్ని వసతులు ఉండడంతో గన్నెల పీహెచ్‌సీకి ఈ ప్రాజెక్టును మార్చారు. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, ఇంజనీరింగ్, వైద్య, ఆరోగ్యశాఖాధికారులతో కలిసి ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సభా స్థలం, హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పీహెచ్‌సీలోని సౌకర్యాలపై వైద్యాధికారులు కనకనాయుడు, గౌరి ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ పీవో వెంట రాజా శ్రీధర్, ఆర్‌అండ్‌బీ డీఈఈ రామన్న, తదితరులు ఉన్నారు.