గంటల తరబడి సెల్‌లోనే...
ABN , Publish Date - May 03 , 2026 | 12:34 AM
ఎంవీపీ కాలనీకి చెందిన ఓ బాలిక ఆరో తరగతి చదువుతోంది. ఆన్‌లైన్ క్లాస్‌లు, ఇతర అవసరాల కోసం తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ ఇస్తుండేవారు.
పిల్లల నుంచి పెద్దల వరకూ సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్న వైనం
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ రీల్స్ చూస్తూ కాలక్షేపం
ఫోన్ వినియోగంపై నియంత్రణ అవసరం
పరిధి దాటితే మానసిక సమస్యల బారినపడే ప్రమాదం
తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించేలా చూడాలని సూచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఎంవీపీ కాలనీకి చెందిన ఓ బాలిక ఆరో తరగతి చదువుతోంది. ఆన్‌లైన్ క్లాస్‌లు, ఇతర అవసరాల కోసం తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ ఇస్తుండేవారు. అందులో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడడం మొదలెట్టింది. తొలుత రోజుకు 30 నిమిషాలపాటు చూసేది. నెమ్మదిగా ఆ సమయం ఆరు నుంచి ఏడు గంటలు దాటుతోంది. చదువుపై దృష్టి సారించకపోవడం, కోపం, చిరాకు పెరగడంతో తల్లిదండ్రులు ఆమెను వైద్యులు వద్దకు తీసుకువెళ్లారు. ఫోన్‌లో స్ర్కీన్ టైమ్ చూసిన వైద్యుడు షాక్ అయ్యారు. ప్రతిరోజూ ఆరేడు గంటలు సోషల్ మీడియాలో వెచ్చిస్తుండడం వల్లే సమస్య ఉత్పన్నమైనట్టు గుర్తించి తల్లిదండ్రులకు తగిన సూచనలు చేసి పంపించారు.
మధురవాడకు చెందిన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకూ ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తుంటాడు. తల్లిదండ్రులు మందలించారు. ఫోన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడున్నాడో తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు ఫోన్‌ను పరిశీలించగా అశ్లీల వెబ్ సైట్లు చూస్తున్నట్టు గుర్తించి, వైద్యుడి వద్దకు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో షార్ట్ వీడియోలు, రీల్స్ చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా వాటికి బానిసలుగా మారుతున్నారు. ఫోన్ ఇవ్వనిదే చిన్నారులు తిండి కూడా తినడం లేదు. పెద్దలైతే గంటల తరబడి ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. మితిమీరి ఫోన్ వినియోగించడం వల్ల మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చుట్టుముట్టే సమస్యలు
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటివి వినియోగించే వారికి సమయం తెలియదు. గంటల తరబడి చూసినా వారికి చికాకుగా అనిపించదు. ఎందుకంటే వాటిని చూడడం ద్వారా మనసు ఉల్లాసాన్ని పొందుతున్న భావనను పొందుతుంటారు. అయితే, గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూడడం వల్ల కొన్నిరకాల ఇబ్బందులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అలాగే ఏకాగ్రత కోల్పోతుంటారు. చదువుపై, ఇతర యాక్టివిటీస్‌పై దృష్టి సారించలేరు. ఇంకా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే కోపం, చికాకు వంటివి పెరుగుతాయి. ఒత్తిడికి గురవుతుంటారు. అదేవిధంగా నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, బ్రెయిన్ అభివృద్ధిపై ప్రభావం చూపించడం, చిన్నారుల్లో అయితే మాట సమస్య రావడం వంటి ఇబ్బందులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయంపై దృష్టి సారించేలా..
షార్ట్స్, రీల్స్ చూసే పిల్లల దృష్టి ప్రత్యామ్నాయం వైపు మళ్లేలా తల్లిదండ్రులు చూడాలి. అంటే ఆటలు ఆడించడం, మ్యూజిక్ నేర్పించడం, పాటలు పాడించడం, సైక్లింగ్ వంటివి చేయించాలి
స్ర్కీన్ టైమ్ మించకుండా చూడాలి..
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అమెరికన్ అకాడమీ ఆఫ్ చైల్డ్ అండ్ అడాల్సెంట్ సైకియాట్రీ వయసుల వారీగా స్ర్కీన్ టైమ్‌కు సంబంధించి కీలక సూచనలు చేశాయి. వాటి ప్రకారం రెండు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు స్ర్కీన్ టైమ్ రోజుకు గంట లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఈ సమయంలో కూడా పిల్లలకు విద్యాపరమైన అంశాలు చూసేలా చూడాలి. అలాగే, ఆరు నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు స్ర్కీన్ టైమ్ రోజుకు రెండు గంటలకు మించరాదు. 18 ఏళ్లుదాటిన వారికి రెండు నుంచి మూగు గంటల మధ్య స్ర్కీన్ టైమ్ ఉండాలి. అయితే, తరచూ విరామం ఉండాలి. అదే పనిగా చూస్తూ ఉండకూడదు.
ఫోన్ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు చెక్ చేయాలి
- డాక్టర్ ఎన్.దీప్‌చంద్, మానసిక వైద్య నిపుణులు
ఫోన్‌లో రీల్స్, షార్ట్ వీడియోలను గంటల తరబడి చూస్తున్నారు. పిల్లల నుంచి యువత వరకు ఇదే వ్యసనంలో ఉంటున్నారు. దీనివల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పరిధి దాటకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల ఫోన్‌ను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. స్ర్కీన్ టైమ్ పరిశీలించాలి. ఎందుకోసం సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తున్నారో చూసి వాటిని రిస్ర్టిక్ట్ చేయాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫోన్ చూడడం వల్ల కలిగే ఆనందాన్ని ప్రత్యామ్నాయంగా ఎందులో పొందుతారో చూసి వాటి వైపు దృష్టిసారించేలా చేయాలి.