కేంద్ర పథకాల అమలుపై ఆరా
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:37 PM
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వర్ణాలి దేక ఒక్కరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పాడేరు మండలంలో పర్యటించారు.
మన్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డైరెక్టర్ పర్యటన
ముంతమామిడి గ్రామంలోని బహుళ ప్రయోజన భవనం సందర్శన
పాడేరు, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వర్ణాలి దేక ఒక్కరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పాడేరు మండలంలో పర్యటించారు. తొలుతగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు జిల్లా కలెక్టర్ టి.నిశాంతి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. తర్వాత ఐటీడీఏలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన పవర్‌పయింట్ ప్రెజెంటేషన్‌ను జిల్లా కలెక్టర్ నిశాంతి, ఐటీడీఏ పీవో శ్రీపూజ, తదితరులతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై డైరెక్టర్ ఆరా తీశారు. అలాగే మండలంలో మినుములూరు పంచాయతీ ముంతమామిడి గ్రామంలో రూ.60 లక్షలతో నిర్మించిన బహుళ ప్రయోజన భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ భవనంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, సామాజిక భవనంగా గిరిజనులు వినియోగించుంటారని ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆమెకు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, ఐటీడీఏ పీవో టిశ్రీపూజ, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, హౌసింగ్ పీడీ బి.బాబు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, ఏటీడబ్ల్యూవో అఖిల, తదితరులు పాల్గొన్నారు.