ఎన్‌టిఆర్ వైద్య సేవపై ఆరా
ABN , Publish Date - May 10 , 2026 | 12:29 AM
‘ఎన్‌టీఆర్ వైద్యసేవ’ పథకంలో రోగులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు యత్నిస్తున్నారు.
పథకంలో సేవలు పొందిన వారికి ట్రస్ట్‌కు చెందిన 104 సెంటర్ నుంచి ఫోన్లు
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యం, ఇతర సేవలపై సమాచారం సేకరణ
ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఆరోగ్య శాఖ యత్నం
ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇకపై జిల్లాలకు ర్యాంకులు
విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి):
‘ఎన్‌టీఆర్ వైద్యసేవ’ పథకంలో రోగులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు యత్నిస్తున్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలు పొందిన రోగులకు ఎన్‌టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోని 104 కాల్ సెంటర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. వైద్యం ఎలా అందుతోంది?, వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారా?, ప్రస్తుతం అందిస్తున్న చికిత్సకు ఆస్పత్రిలో డబ్బులు చెల్లించాల్సిందిగా అడుగుతున్నారా?, ఆస్పత్రిలో అందించే ఆహారం నాణ్యంగా ఉంటోందా?, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయా?, వైద్య మిత్రలు ప్రతిరోజూ బెడ్ విజిట్ చేస్తున్నారా?...అనే విషయాలను అడిగి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఎప్పటినుంచో ఉంది. అయితే, మరింత విస్తృతంగా అభిప్రాయాలను సేకరించడం ద్వారా సమస్యలను గుర్తించేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో రోగుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేయడం, ఉచితంగా ఆహారాన్ని అందించకపోవడం, కొన్నిచోట్ల ఆరోగ్యమిత్రలు సహకారాన్ని అందించకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నట్టు ఉన్నతాధికారులు దృష్టికి వచ్చింది.
జిల్లాల వారీగా ర్యాంకులు
రోగుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం అమలులో జిల్లాలకు ర్యాంకులు ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఫీడ్ బ్యాక్‌ను ఆయా జిల్లాల అధికారులకు తెలియజేస్తున్నారు. ఇకపై, ర్యాంకులు విడుదల చేయడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీని జిల్లాల మధ్య పెంచే యోచనలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నట్టు చెబుతున్నారు.
ఇదీ లెక్క..
‘ఎన్‌టీఆర్ వైద్య సేవ’ నెట్‌వర్క్‌లో జిల్లాలో 85 ప్రైవేటు, 22 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజూ 750 నుంచి 900 వరకు రిజిస్ర్టేషన్స్ అవుతుంటాయి. వైద్య సేవలు పొంది ఇంటికి వెళ్లేవారు, శస్త్రచికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యేవారు 200 నుంచి 300 వరకూ ఉంటారు. ఇన్‌పేషెంట్లుగా సేవలు పొందేవారు 400 మందికిపైగా ఉంటారు. వీరిలో పది నుంచి 20 శాతం మంది నుంచి ఫోన్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఎన్‌టీఆర్ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుతం 104 కాల్ సెంటర్ ద్వారా రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్టు తెలిపారు. వాటి ఆధారంగా ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేసి, రోగులు ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనధికారికంగా డబ్బులు వసూలుచేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని, పరిధి దాటి వ్యవహరిస్తే జరిమానా విధిస్తామన్నారు.