Share News

గర్భిణి మృతిపై విచారణ

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:05 AM

జీకే వీధి మండలం ధారకొండ పీహెచ్‌సీ పరిధిలోని చిన్నగంగవరంలో నిండు గర్భిణి పాంగి పావని మృతిపై డీఎంహెచ్‌వో డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌ సోమవారం విచారణ చేపట్టారు.

గర్భిణి మృతిపై విచారణ
చిన్నగంగవరం గ్రామంలో గర్భిణి పావని మృతిపై వైద్య సిబ్బందిని విచారిస్తున్న డీఎంహెచ్‌వో రియాజ్‌ బేగ్‌

చిన్నగంగవరం గ్రామానికి వాగు దాటి వెళ్లి వివరాలు సేకరించిన డీఎంహెచ్‌వో

పీహెచ్‌సీలో అందుతున్న సేవలపై ఆరా

నిండు గర్భిణులను ప్రసవానికి 10 రోజుల ముందే బర్త్‌ వెయింటింగ్‌ హాల్‌కు తరలించాలి

ఆ బాధ్యత ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందిదేనని వెల్లడి

సీలేరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం ధారకొండ పీహెచ్‌సీ పరిధిలోని చిన్నగంగవరంలో నిండు గర్భిణి పాంగి పావని మృతిపై డీఎంహెచ్‌వో డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌ సోమవారం విచారణ చేపట్టారు. ఆ గ్రామానికి ఆయన ఉధృతంగా ప్రవహిస్తున్న గంగవరం వాగును దాటి నడుచుకుంటూ వెళ్లారు. మృతురాలు పావని ఇంటికి వెళ్లి ఆమె భర్త నాగేశ్వరరావు, వారి బంధువులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. పావనిని ఈ నెల 16న పీహెచ్‌సీకి తీసుకువచ్చి అక్కడ ఉంచకుండా ఏ కారణంతో ఇంటికి తీసుకువెళ్లిపోయారని అడిగి తెలుసుకున్నారు. అక్కడ వైద్య సేవలు అందించలేదా?, సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని ఆరా తీశారు. తాము ఆస్పత్రికి వెళ్లే సమయానికి తన భార్య పావనికి నొప్పులు రాలేదని, పురిటినొప్పులు ప్రారంభమైన తరువాత ఆస్పత్రికి తీసుకురావచ్చనే ఉద్దేశంతో ఇంటికి తీసుకువెళ్లిపోయామని ఆమె భర్త నాగేశ్వరరావు తెలిపారు. అక్కడ వైద్య సేవలు బాగానే అందించారని చెప్పారు. అయితే భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు దారి లేకపోయిందని తెలిపారు. ధారకొండ పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణపై గ్రామస్థులను డీఎంహెచ్‌వో అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన వైద్య సిబ్బందిని విచారించారు. నిండు గర్భిణులను డెలివరికీ 10 రోజుల ముందుగానే బర్త్‌ వెయింటింగ్‌ హాల్‌కు తరలించే బాధ్యత ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందిదేనని ఆయన తెలిపారు. అక్కడ నుంచి ధారకొండ పీహెచ్‌సీకి వెళ్లి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం సీలేరు పీహెచ్‌సీను తనిఖీ చేశారు. ఆయన వెంట డీపీహెచ్‌ఎన్‌వో భూలోకమ్మ, ధారకొండ వైద్యాధికారి బాబ్జీ, సీలేరు వైద్యాధికారి శ్రీసాగర్‌ ఉన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 12:05 AM