Share News

ఆక్సిజన్‌ బిల్లులపై విచారణ

ABN , Publish Date - Jul 26 , 2026 | 01:08 AM

కేజీహెచ్‌లో ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించిన బిల్లుల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై కమిటీ శనివారం విచారణ చేపట్టింది.

ఆక్సిజన్‌ బిల్లులపై విచారణ

గతంలో ఎంత చెల్లించేవారు ఇప్పుడు ఎంత చెల్లిస్తున్నారు

కేజీహెచ్‌లో తొలిరోజు పది మంది అధికారులు, సిబ్బందిని ప్రశ్నించిన విచారణ కమిటీ

ఫిర్యాదులోని అంశాలపై సమగ్ర సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నావళి

లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకున్న బృందం

నేడు, రేపు కొనసాగింపు

ఒకపక్క విచారణ జరుగుతుండగా మరోపక్క పత్రికా ప్రకటన విడుదల చేసిన సూపరింటెండెంట్‌

విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లో ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించిన బిల్లుల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై కమిటీ శనివారం విచారణ చేపట్టింది. అడ్డగోలుగా బిల్లులు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదులు అందడంతో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ఆరుగురితో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కమిటీలో ఉన్న అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణమూర్తి, విజయనగరం మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దేవిమాధవి, బయో మెడికల్‌ ఇంజనీర్‌, మరో ఇద్దరు ఫార్మసిస్టులతో కూడిన బృందం ఉదయం 11 గంటలకు ఆస్పత్రికి చేరుకుంది. సూపరింటెండెంట్‌ కార్యాలయం పైఅంతస్థులోని ఎథిక్స్‌ గ్యాలరీలో విచారణ చేపట్టింది. తొలిరోజు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి, అడ్మినిస్ర్టేటర్‌ బీవీ రమణ, ఏడీ సుమతి, డీసీఎస్‌ఆర్‌ఎంవో/ఇన్‌చార్జి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ కుమార్‌తోపాటు ఫార్మసీ విభాగానికి చెందిన ముఖ్య అధికారి, బయో మెడికల్‌ ఇంజనీర్‌తోపాటు ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ, బిల్లుల చెల్లింపు వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరు ఉద్యోగులు మొత్తం సుమారు పది మంది ఉద్యోగులను విచారించింది. ఒక్కొక్కరితో సుదీర్ఘంగా మాట్లాడిన కమిటీ సభ్యులు కీలక అంశాలతో కూడిన ప్రశ్నావళిని వారికి అందించి లిఖిత పూర్వకంగా సమాధానాలను రాబట్టారు. గతంలో ఆక్సిజన్‌ సరఫరా సంస్థకు నెలకు ఎంత బిల్లు చెల్లించేవారు, ఇప్పుడు ఎంత చెల్లిస్తున్నారు, ఆక్సిజన్‌ వచ్చిన ప్రతిసారి వాటి పర్యవేక్షణ బాధ్యతలను ఎవరు చూస్తున్నారు?, ఫార్మాస్యూటికల్‌ బిల్లులతో ఆక్సిజన్‌ బిల్లులను ఎందుకు కలిపారు?, నెలవారీ అవసరాలకు కేజీహెచ్‌కు ఎంత ఆక్సిజన్‌ అవరమవుతుంది?, అదనంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా?, ఇదంతా నిబంధనలు మేరకు జరిగిందా?...అనే వివరాలను విచారణ కమిటీ సేకరించింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7.30 గంటల వరకు కొనసాగినట్టు తెలిసింది. ఆదివారం కూడా కమిటీ విచారణ చేయనుంది. సెలవులో ఉన్న సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ యు.శ్రీహరితోపాటు ఇతర అధికారులను సోమవారం విచారించి నివేదికను సమర్పించనుంది. అంతకుముందు ఆక్సిజన్‌ను నిల్వ చేసే ట్యాంకును విచారణ కమిటీ పరిశీలించింది. కీలక డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది.

విచారణ వేళ సూపరింటెండెంట్‌ మీడియా ప్రకటన

ఆక్సిజన్‌ బిల్లుల చెల్లింపుతోపాటు అనేక అంశాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీఎం చంద్రబాబునాయుడు, కలెక్టర్‌కు కొందరు ఫిర్యాదుచేశారు. ఆ విషయాన్ని పత్రికలు రాశాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు కమిటీని నియమించారు. అయితే, ఫిర్యాదు చేసిన విషయాన్ని వార్తగా రాసిన మీడియాను తప్పుబట్టేలా కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. కేజీహెచ్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కొందరు వ్యక్తులు యత్నిస్తున్నారని, గుర్తింపులేని, కల్పిత పేర్లతో ఫిర్యాదులు ఇస్తే కథనాలు రాస్తున్నారంటూ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవైపు విచారణ జరుగుతుండగానే బిల్లులు చెల్లింపుతోపాటు ప్రభుత్వ నిబంధనలకు లోబడి, ఉన్నతాధికారుల అనుమతితో పారదర్శకంగా చేసినట్టు ఆమె ప్రకటించడం విశేషం.

Updated Date - Jul 26 , 2026 | 01:08 AM