Share News

నర్సింగ్‌ విద్యా సంస్థలపై విచారణ

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:04 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనేక నర్సింగ్‌ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

నర్సింగ్‌ విద్యా సంస్థలపై విచారణ

ఏపీఎన్‌ఎంసీ చైర్మన్‌ ఉత్తర్వులు

కమిటీల నియామకం

23లోగా తనిఖీలు చేపట్టి నివేదికలు సమర్పించాలని ఆదేశం

విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనేక నర్సింగ్‌ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఒకచోట కళాశాల ఏర్పాటుకు అనుమతి తీసుకుని అనధికారికంగా మరో రెండు, మూడు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇటువంటి కాలేజీలపై కొన్నాళ్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించారు. ఆయా విద్యా సంస్థల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని ఏపీ నర్సెస్‌, మిడ్‌ వైవ్స్‌, ఆక్సిలరీ నర్స్‌- మిడ్‌వైవ్స్‌, హెల్త్‌ విజిటర్స్‌ కౌన్సిల్‌ (ఏపీఎన్‌ఎంసీ) ప్రెసిడెంట్‌ ఆదేశాలను జారీచేశారు. ఈ నెల 23వ తేదీలోగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి డాక్యుమెంట్‌, ఫొటోగ్రాఫ్‌, వీడియో రికార్డులతో సహా సవివరంగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఈ కాలేజీలపై ఫిర్యాదులు

నగర పరిధిలోని పెందుర్తిలో గల అమృత కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌, స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో తనిఖీకి ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి నేతృత్వంలో నర్సింగ్‌ ఫ్యాకల్టీ కె.ఝాన్సీలక్ష్మి, ఎం.మీచల్‌తో కూడిన కమిటీని నియమించారు. అదే ప్రాంతంలోని మహాత్మా కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌ కళాశాల తనిఖీకి కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉషా కిరణ్‌ నేతృత్వంలో డాక్టర్‌ ఎం.మునిరత్నం, ఎం.పద్మకుమారి, నగర పరిధిలోని సత్యం కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌ను ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి నేతృత్వంలో కె.కౌసల్యాదేవి, వై.పద్మజ, పెందుర్తిలోని ఆర్టస్‌ కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌, ఆర్టస్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ను కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి నేతృత్వంలో ఎన్‌.దీనకుమారి, ఎం.ఉమాసుందరితో కూడిన కమిటీలు తనిఖీ చేయనున్నాయి. అలాగే, నర్సీపట్నంలోని శ్రీవెంకటేశ్వర కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌ను కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి, ఎస్‌.అరుణ కుమారి, ఎన్‌.శకుంతల, కొత్తవలసలోని కౌముది స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ను డాక్టర్‌ ఐ.వాణి, మంగాదేవి, బి.పద్మ, పెందుర్తిలోని శాంతి స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ను రంగరాయ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉషాకిరణ్‌, ఎ.విమల, ఎస్‌.సుజాత, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని ఇమ్మానుయేల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ను డాక్టర్‌ ఉషాకిరణ్‌, ఎ.విమల, ఎస్‌.సుజాతతో కూడిన బృందం తనిఖీ చేయాలని ఏపీఎన్‌ఎంసీ చైర్మన్‌ ఆదేశించారు. ఈ కమిటీలు ఆయా కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

Updated Date - Aug 21 , 2026 | 01:04 AM