వైద్యశాఖలో ఒప్పంద అక్రమాలపై విచారణ
ABN , Publish Date - Jun 22 , 2026 | 10:54 PM
వైద్యశాఖలో వార్షిక కాంట్రాక్ట్ ఒప్పందాల రెన్యూవల్‌లో అక్రమాలపై ఉద్యోగుల ఫిర్యాదు మేరకు సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్ అడిషనల్ డైరెక్టర్ కేవీఎన్‌ఎస్.అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు.
బాధిత ఉద్యోగుల నుంచి ఆధారాలు సేకరించిన ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఏడీ
నేడు రంపచోడవరంలో పర్యటన
పాడేరు, జూన్ 22(ఆంధ్రజ్యోతి): వైద్యశాఖలో వార్షిక కాంట్రాక్ట్ ఒప్పందాల రెన్యూవల్‌లో అక్రమాలపై ఉద్యోగుల ఫిర్యాదు మేరకు సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్ అడిషనల్ డైరెక్టర్ కేవీఎన్‌ఎస్.అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా 353 మంది కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఒప్పంద ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు సంబంఽధించి స్థానిక వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు అక్రమంగా వసూలు చేశారు. అయితే తాము లంచాలు ఇవ్వబోమనే ఉద్యోగులపై అధికారులు కక్షగట్టి మరీ ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో తమకు జరిగిన అన్యాయంపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లు గత నెల ఏడున ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు వైద్యశాఖ జాతీయ గ్రామీణా ఆరోగ్య కమిషన్ అడిషనల్ డైరెక్టర్ కేవీఎన్‌ఎస్.అనిల్‌కుమార్‌ను విచారణాధికారిగా నియమించామని, ఈనెల 22న పాడేరులో, 23న రంపచోడవరంలో విచారణ చేపడతారని బాధిత ఉద్యోగులకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సముదాయంలో ఉన్న జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వైద్యశాఖ జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్ అడిషనల్ డైరెక్టర్ కేవీఎన్‌ఎస్.అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయంపై ఆధారాలు, పలు డాక్యుమెంట్‌లను బాధిత ఉద్యోగులు విచారణాధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ వైద్యఉద్యోగుల సంఘం నేతలు బి.సందీప్‌కుమార్, ఎన్.పవన్‌కల్యాణ్, వాసు, వెంకట్, బాధిత ఉద్యోగులు పాల్గొన్నారు.