Share News

హెచ్‌పీసీఎల్‌ ప్రమాదంపై విచారణ

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:15 AM

మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంపై అధికార వర్గాలు లోతైన విచారణ చేస్తున్నాయి.

హెచ్‌పీసీఎల్‌ ప్రమాదంపై విచారణ

హైఓల్టేజ్‌ విద్యుత్‌ తీగల నుంచి వచ్చిన స్పార్క్‌ కారణమా

ప్రాథమికంగా నిర్ధారణ

లోతుగా పరిశీలిస్తున్న అధికారులు

విశాఖపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):

మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంపై అధికార వర్గాలు లోతైన విచారణ చేస్తున్నాయి. కూలింగ్‌ టవర్‌కు సమీపానున్న రెసిడ్యూ అప్‌గ్రెడేషన్‌ ఫెసిలిటీ (ఆర్‌ఎఫ్‌యు) పిచ్‌ ఇంటర్మీడియట్‌ ట్యాంకు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ టవర్‌ నుంచి పెద్ద పెద్ద మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ పారిశ్రామిక ప్రాంతం అంతా కమ్ముకుంది. వెంటనే స్పందించిన హెచ్‌పీసీఎల్‌ అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. స్థానికుల ప్రాథమిక సమాచారం ప్రకారం ముందు పేలుడు శబ్దం వచ్చింది. ఆ తరువాత మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై ఫ్యాక్టరీస్‌ విభాగం, పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో) అధికారులతో పాటు ముంబై నుంచి వచ్చిన హెచ్‌పీసీఎల్‌ ప్రత్యేక బృందం దర్యాప్తు నిర్వహిస్తోంది.

రిఫైనరీలో క్రూడ్‌ ఆయిల్‌ను శుద్ధి చేసి పెట్రోలియం వంటి పదార్థాలు తీసిన తరువాత బ్యారెల్‌/ట్యాంకులో అడుగున ఉండే నల్లటి మలిన పదార్ధాన్ని రెసిడ్యూగా వ్యవహరిస్తారు. అందులో హైడ్రోకార్బన్‌, సల్ఫర్‌ వంటివి అధిక మోతాదులో ఉంటాయి. దానిని మళ్లీ క్రాకర్‌ యూనిట్‌కు పంపించి లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌, డీజిల్‌, ఫ్యూయల్‌ ఆయిల్‌ వంటివి తయారుచేస్తారు. సల్ఫర్‌ అధిక మోతాదులో కలిగిన పిచ్‌ స్టోరేజీ ట్యాంకులో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ స్టోరేజీ ట్యాంక్‌ మీదుగా హైఓల్టేజీ కలిగిన విద్యుత్‌ వైర్లు వెళుతున్నాయి. వాటి నుంచి వెలువడిన వేడికి కిందన ఎక్కడో స్పార్క్‌ వచ్చి ఆ తరువాత మంటలుగా మారి ఉండవచ్చునని ఫ్యాక్టరీస్‌ విభాగం అధికారుల తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని వారు పేర్కొనడం గమనార్హం. ఈ ప్రమాదంలో సేకరించిన రెసిడ్యూ నమూనాలు, ట్యాంకు నిర్మాణం, అక్కడి ఆర్‌ఎఫ్‌యులో నిర్వహిస్తున్న ఆపరేషన్‌ వివరాలను సేకరించారు. కొన్నింటిని పరీక్షల కోసం లేబొరేటరీకి పంపించారు. స్థానికులు చెప్పినట్టుగా అక్కడ పేలుడు సంభవించిన ఆనవాళ్లు ఏమీ కనపడలేదని ఒక అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రమాదానికి కారణమైన ‘స్పార్క్‌’ ఎలా వచ్చిందనే దానిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


డిసెంబరు 13న భారత్‌, శ్రీలంక వన్డే

విశాఖపట్నం-స్పోర్ట్స్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):

పీఎం పాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో డిసెంబరు 13న భారత్‌, శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్‌ జరగనున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డిసెంబరు 13న జరగనున్న తొలి మ్యాచ్‌కు విశాఖ వేదిక కానున్నది. బీసీసీఐ ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం తొలి వన్డే ఢిల్లీలో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోపాటు స్టేడియం పునరుద్ధరణ పనుల కారణంగా మ్యాచ్‌ను నిర్వహించలేమని బీసీసీఐకు ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ స్పష్టంచేసింది. దీంతో ఆ మ్యాచ్‌ను విశాఖలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.


గాజువాక ఏజెంట్‌పై పీడీ యాక్ట్‌

నిరుద్యోగులను మోసం చేసిన కేసులో అరెస్టు

రిమాండ్‌పై సెంట్రల్‌ జైలుకు తరలింపు

విశాఖపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కంబోడియా తరలించి, అక్కడ సైబర్‌ నేరాలకు పాల్పడే గ్యాంగ్‌లకు అప్పగిస్తున్న ప్రధాన ఏజెంట్‌ చుక్కా రాజేశ్‌పై విశాఖ పోలీసులు పీడీ యాక్ట్‌ను అమలుచేశారు. రాజేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌పై సెంట్రల్‌జైలుకు తరలించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గాజువాక ప్రాంతానికి చెందిన రాజేశ్‌ ఒక ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించాడు. మయన్మార్‌, కంబోడియా, వియత్నాం, లావోస్‌ వంటి దేశాల్లో భారీ జీతంతో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. ఒక్కో యువకుడి నుంచి రూ.రెండు లక్షలు తీసుకుని వారికి ఫ్లైట్‌ టికెట్‌, బిజినెస్‌ వీసా ఏర్పాటు చేసి కంబోడియాలోని ఏజెంట్లకు అప్పగించేవాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఏజెంట్లు వారిని సైబర్‌ స్కామ్‌ చేసే ఏజెంట్లకు విక్రయించి సొమ్ముచేసుకునేవారు. ఉద్యోగం అని చెప్పి వారితో సైబర్‌ నేరాలకు పాల్పడాలంటూ టార్గెట్‌లు విధించేవారు. భారతదేశంలోని పౌరులకు ఫోన్‌ చేసి మాయమాటలతో వారి ఖాతాల్లోని డబ్బును తాము సూచించిన ఖాతాల్లోకి జమ చేయించాలని ఆదేశించేవారు. అందుకు ఎవరైనా నిరాకరిస్తే వారిని చీకటి గదుల్లో బంధించి హింసించేవారు. ఇలా సైబర్‌ ముఠాల చేతిలో బందీలుగా చిక్కిన అనేకమంది తమను కాపాడాలంటూ వీడియోల ద్వారా నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చిని అభ్యర్థించారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించి.. ప్రత్యేక బృందాలను కంబోడియా, వియత్నాం, మయన్మార్‌ వంటి దేశాలకు పంపించి వారిని కాపాడారు. బాధితులిచ్చిన వివరాల ఆధారంగా చుక్కా రాజేశ్‌ ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరించి సైబర్‌ ముఠాలకు విక్రయించినట్టు తేలడంతో అతడిపై పలు కేసులు నమోదుచేశారు. తాజాగా అతడిని పీడీ యాక్ట్‌ కింద అరెస్టు చేసి కేంద్ర కారాగారానికి తరలించారు.

Updated Date - Nov 06 , 2026 | 01:15 AM