వినూత్న రీతిలో పసుపు ఉత్పత్తి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:40 PM
ఆదివాసీ రైతులు వినూత్న పద్ధతిలో పసుపు ఉత్పత్తి చేస్తున్నారు. థింసా ఆర్గానిక్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సహకారంతో శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ స్లైసింగ్ రూపంలో పసుపును తయారు చేస్తున్నారు.
స్లైసింగ్ పద్ధతిని రైతులకు పరిచయం చేస్తున్న ఎఫ్‌పీవో
జాతీయ మార్కెట్‌లో అధిక ధర
రైతులకు తగ్గనున్న కూలీ, వంట చెరకు ఖర్చు
చింతపల్లి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు వినూత్న పద్ధతిలో పసుపు ఉత్పత్తి చేస్తున్నారు. థింసా ఆర్గానిక్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సహకారంతో శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ స్లైసింగ్ రూపంలో పసుపును తయారు చేస్తున్నారు. ఈ విధానం వల్ల కూలీలు, వంట చెరకు ఖర్చులను రైతులు ఆదా చేసుకుంటున్నారు. అలాగే స్లైసింగ్ పద్ధతిలో ఉత్పత్తి చేసిన పసుపునకు మార్కెట్‌లో అధిక ధర లభిస్తుంది.
గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు కొన్నేళ్లుగా సుగంధ ద్రవ్య పంటగా పసుపును సాగు చేస్తున్నారు. ఏజెన్సీ పదకొండు మండలాల్లో 25 వేల ఎకరాల్లో ఆదివాసీ రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. ఎకరానికి పచ్చి పసుపు 4.5 నుంచి 5 టన్నులు దిగుబడి వస్తుంది. గిరిజన రైతులు పసుపును రెండేళ్ల పంటగా సాగు చేస్తున్నారు. ఈ విధానం వల్ల సమయం వృథా కావడంతో పాటు రైతులు తక్కువ ఆదాయం పొందుతున్నారు. శాస్త్రవేత్తలు 8 నుంచి 9 నెలల కాలంలో పండించే పసుపు వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తక్కువ మంది రైతులు రోమా పసుపును తొమ్మిది నెలల పంటగా సాగు చేస్తున్నారు.
ఉడికించే పద్ధతిలో పసుపు ఉత్పత్తి
గిరిజన రైతులు కొన్నేళ్లుగా ఉడికించే పద్ధతి ద్వారా ఎండు పసుపును ఉత్పత్తి చేస్తున్నారు. పంట పొలం నుంచి సేకరించిన పచ్చి పసుపును ఆవిరిలో ఉడికించి ఎండబెడుతున్నారు. పసుపు ఎండిన తరువాత యంత్రాలు, సంప్రదాయ వస్తువులతో ఆదివాసీ రైతులు పాలిష్ చేస్తున్నారు. పసుపును ఆవిరిలో ఉడికించేందుకు అధిక మొత్తంలో వంట చెరకుతో పాటు కూలీలు అవసరం. రైతులు ఎండు పసుపుగా ఉత్పత్తి చేసేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ విధంగా ఉత్పత్తి చేసిన ఎండు పుసుపును రైతులు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు పండించిన పసుపులో కుర్క్‌మిన్ శాతం అధికంగా ఉంటుంది. దీంతో జాతీయ మార్కెట్‌లో ఈ పసుపునకు మంచి డిమాండ్ ఉంది. గత ఏడాది మార్కెట్ ప్రారంభంలో కిలో రూ.90 ధర లభించగా, నెల రోజుల వ్యవధిలోనే రూ.140 ధర లభించింది. ప్రతి ఏడాది పసుపు ధర పెరుగుతుండడంతో ఆదివాసీ రైతులు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. కొంత మంది రైతులు ఎండు పసుపు ఉత్పత్తి వంట చెరకు, కూలీల కొరత వల్ల తక్కువ ధరకు పచ్చి పసుపును విక్రయించుకుంటున్నారు.
స్లైసింగ్ పద్ధతిపై ఆసక్తి
థింసా ఆర్గానిక్ రైతు ఉత్పత్తిదారుల సంఘం గిరిజన రైతులకు స్లైసింగ్ పద్ధతిలో ఎండు పసుపు ఉత్పత్తి చేయడాన్ని పరిచయం చేసింది. ఈ విధానంలో వంట చెరకు అవసరం లేకపోవడం వల్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. గిరిజనులు పంట పొలం నుంచి సేకరించిన పసుపును శుభ్రం చేసుకుని కొమ్ములను స్లైస్ రూపంలో కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పసుపు కొమ్ము పరిమాణం ఆధారంగా నాలుగు, ఆరు స్లైస్(బద్దలు)గా చేసుకోవాలి. ఈ విధంగా స్లైస్ చేసుకున్న పసుపు ముక్కలను సిమెంట్ కల్లాలు, టార్పాలిన్లపైన ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన పసుపును నేరుగా విక్రయించుకోవచ్చు. స్లైసింగ్ పద్ధతిలో ఉత్పత్తి చేసిన పసుపును పాలిష్ చేయాల్సిన అవసరం లేదు. ఆవిరి రూపంలో ఉడికించిన పసుపు మూడు కిలోలు ఎండిన తరువాత ఒక కిలో వస్తుంది. స్లైసింగ్ పద్ధతిలో 3.5 కిలోల పసుపు ఒక కిలో ఎండు పసుపు వస్తుంది. స్లైసింగ్ పద్ధతిలో వంట చెరకు అవసరం ఉండదు. పాలిష్ చేయాల్సిన అవసరం ఉండదు. స్లైసింగ్ రూపంలో ఉత్పత్తి చేసిన ఎండు పసుపునకు మార్కెట్‌లో కిలో రూ.160 ధర లభిస్తున్నది. ఆవిరి ద్వారా ఉడికించి ఎండబెట్టిన పసుపు కంటే స్లైసింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన పసుపునకు రూ.20 అధిక ధర లభిస్తుందని థింసా ఆర్గానిక్ ఎఫ్‌పీవో ప్రతినిధులు తెలిపారు.