Share News

బార్క్‌ నిర్వాసితులకు అన్యాయం

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:55 AM

బాబా అణు పరిశోధనా కేంద్రానికి (బార్క్‌) భూములు ఇచ్చిన తమకు తీరని అన్యాయం జరుగుతున్నదని మండలంలోని తంతడి, రాజానపాలెం పంచాయతీ పరిధిలోగల నిర్వాసితులు వాపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో సాగులో వున్న పేదలకు కాకుండా, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి, ఉద్యోగులకు ప్యాకేజీ కింద పరిహారం అందజేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వ భూములను నిరుపేదలు సాగుచేసుకుంటుండగా.. వేరే వ్యక్తులను సాగుదారులుగా పేర్కొంటూ పరిహారం సొమ్ము చెల్లించారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తంతడి, రాజానపాలెం పంచాయతీలకు చెందిన ‘బార్క్‌’ నిర్వాసితులు చెబుతున్న వివరాలిలా వున్నాయి.

బార్క్‌ నిర్వాసితులకు అన్యాయం
తంతడి సర్వే నంబరు 141లో బార్క్‌ కోసం సేకరించిన కొండ ప్రాంతాలు

సాగుదారులకు పరిహారం చెల్లింపులో తీవ్రజాప్యం

మరోవైపు జాబితాలో అన్యుల పేర్లు

స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి భార్యకు రూ.50 లక్షల పరిహారం

ఒకే మహిళకు రెండు పేర్లతో పరిహారం చెల్లింపు

ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని నిర్వాసితుల ఆవేదన

అచ్యుతాపురం, నవంబరు 26 (ఆంరఽధజ్యోతి): బాబా అణు పరిశోధనా కేంద్రానికి (బార్క్‌) భూములు ఇచ్చిన తమకు తీరని అన్యాయం జరుగుతున్నదని మండలంలోని తంతడి, రాజానపాలెం పంచాయతీ పరిధిలోగల నిర్వాసితులు వాపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో సాగులో వున్న పేదలకు కాకుండా, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి, ఉద్యోగులకు ప్యాకేజీ కింద పరిహారం అందజేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వ భూములను నిరుపేదలు సాగుచేసుకుంటుండగా.. వేరే వ్యక్తులను సాగుదారులుగా పేర్కొంటూ పరిహారం సొమ్ము చెల్లించారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తంతడి, రాజానపాలెం పంచాయతీలకు చెందిన ‘బార్క్‌’ నిర్వాసితులు చెబుతున్న వివరాలిలా వున్నాయి.

మండలంలోని ఉమ్మడి తంతడి పంచాయతీ పరిధి సర్వే నంబరు 141లో 127 ఎకరాల విస్తీర్ణంలో కొండప్రాంతం ఉంది. ఇందులో సుమారు 50 ఎకరాలను రాజానపాలెం, అంగవానిపాలెంలోగల నిరుపేదలు తాతముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. జీడిమామిడి తోటలు పెంచుకుంటూ వాటిపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఎట్టకేలకు 1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇక్కడి సాగుదారులకు డి. పట్టాలు జారీచేసింది. కానీ ఈ పట్టాల గురించి సాగుదారులు అంతగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సుమారు పుష్కరకాలం క్రితం ప్రభుత్వం అచ్యుతాపురం మండలంలో సుమారు 2,200 ఎకరాలను బాబా అణు పరిశోధనా కేంద్రానికి కేటాయించింది. తంతడి పంచాయతీ పరిధి సర్వే నంబరు 141లోని కొండప్రాంతం కూడా ఇందులో వుంది. ప్రభుత్వ రికార్డుల్లో ఇది కొండపోరంబోకుగా నమోదైఉన్నప్పటికీ అనాదిగా సాగుచేసుకుంటూ, డి.పట్టాలు ఉన్నవారికి పరిహారం చెల్లించాలని సాగుదారులు డిమాండ్‌ చేశారు. పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఎకరాకు రూ.20 లక్షలు పరిహారంగా ఇవ్వడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు.. నిధుల కొరత నెపంతో నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. ఐదేళ్లపాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. 2024 సాధారణ ఎన్నికల ముందు వైసీపీ నాయకులు తమకు అనుకూలమైన వారితోపాటు కొంతమంది ఉద్యోగుల పేర్లను నిర్వాసితుల జాబితాలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న నిజమైన సాగుదారులు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో చెల్లింపులు జరగలేదు. తరువాత కూటమి అధికారంలోకి రావడం, భూములు అప్పగించాలని బార్క్‌ అధికారులు ఒత్తిడి తేవడంతో గత సెప్టెంబరు నుంచి నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు ప్రారంభించారు. అయితే అప్పట్లో వైసీపీ నాయకులు తయారుచేసిన జాబితాలో పేర్లు వున్న వారికిఇ మాత్రమే ఇప్పుడు అధికారులు చెల్లింపులు జరుపుతున్నారు. సుమారు 20 ఎకరాలకు సంబంధించి 12 మంది అన్యుల పేరున పట్టాలు వున్నాయి. వీరిలో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి భార్య పేరున రెండున్నర ఎకరాలు వున్నట్టు జాబితాలో వుండడంతో ఆమెకు రూ.50 లక్షల పరిహారం చెల్లించారు. అలాగే వెంకటలక్ష్మి, రామలక్ష్మి అనే పేర్లతో ఒకే వ్యక్తి రెండు పరిహారాలు తీసుకున్నారు. నిజమైన సాగుదారులకు మాత్రం ఇంతవరకు పరిహారం అందలేదు. అక్రమ సాగుదారులకు పరిహారం చెల్లించడంపై స్థానిక అధికారులతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు.

Updated Date - Nov 27 , 2026 | 01:55 AM