మన్యానికి సందర్శకుల తాకిడి
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:56 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో ఆదివారం పర్యాటకుల తాకిడి నెలకొంది
జోరందుకున్న పిక్నిక్‌ల సీజన్
పాడేరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో ఆదివారం పర్యాటకుల తాకిడి నెలకొంది. ప్రస్తుతం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు, మంచు మేఘాలు కురుస్తుండడంతో పిక్నిక్‌ల సీజన్ జోరందుకుంటున్నది. దీంతో ఆదివారం ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల హడావిడి నెలకొంది.
అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటక సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ సన్ రైజ్ పాయింట్, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో చెరువువేనం మేఘాలకొండ, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు.
లంబసింగిలో...
చింతపల్లి: ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. వాతావరణ సహకరించడంతో ఉదయం ఐదు గంటలకే లంబసింగి జంక్షన్, భీమనాపల్లి, చెరువులవేనం, తాజంగి జలాశయానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకున్నారు. చెరువులవేనంలో మంచు అందాలను ఆస్వాదిస్తూ సందర్శకులు ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు జిప్‌లైన్, బోటింగ్ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు.