Share News

జలాశయాలకు తగ్గిన వరద నీరు

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:25 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలాశయాలకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో డొంకరాయి జలాశయం మినహా మిగతా జలాశయాల నుంచి నీటి విడుదలను బుధవారం నుంచి తగ్గించామని ఏపీ జెన్‌కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ జాకీర్‌ హుస్సేన్‌ తెలిపారు.

జలాశయాలకు తగ్గిన వరద నీరు
డొంకరాయి జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

డొంకరాయి మినహా బలిమెల, గుంటవాడ నుంచి నీటి విడుదల తగ్గింపు

ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌ ఎస్‌ఈ జాకీర్‌ హుస్సేన్‌

సీలేరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలాశయాలకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో డొంకరాయి జలాశయం మినహా మిగతా జలాశయాల నుంచి నీటి విడుదలను బుధవారం నుంచి తగ్గించామని ఏపీ జెన్‌కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ జాకీర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జోలాపుట్టు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,750 అడుగులు కాగా, ప్రస్తుతం 2,744.85 అడుగుల వద్ద నీటిమట్టం ఉందని, దీంతో బలిమెల జలాశయానికి నీటి విడుదలను నిలిపివేశామన్నారు. బలిమెల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,516 అడుగులు కాగా, ప్రస్తుతం 1,508.2 అడుగులు ఉందన్నారు. దీంతో బలిమెల జలాశయం నుంచి నీటి విడుదలను 34 వేల క్యూసెక్కుల నుంచి 7 వేల క్యూసెక్కులకు తగ్గించామని ఆయన తెలిపారు. గుంటవాడ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,360 అడుగులు కాగా, ప్రస్తుతం 1,343.8 అడుగులు ఉందని, దీంతో వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. డొంకరాయి జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,037 అడుగులు కాగా, ప్రస్తుతం 1,030.70 అడుగులు ఉందని, ఇక్కడ నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో 4,300 క్యూసెక్కుల నీటిని పవర్‌ కెనాల్‌ ద్వారా పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు.

Updated Date - Nov 04 , 2026 | 11:25 PM