Share News

విశాఖకు ‘ఇన్ఫినిక్స్‌’

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:49 AM

నగరానికి మరికొన్ని ఐటీ, ఆతిథ్య రంగాలకు చెందిన కంపెనీలు రానున్నాయి.

విశాఖకు ‘ఇన్ఫినిక్స్‌’

ఐటీ సంస్థకు రూ.5.08 ఎకరాలు కేటాయింపు

సిఫీకి అదనంగా మరో 25 ఎకరాలు

త్రిఫల ఆయుర్వేద సంస్థ రిసార్ట్స్‌కు స్థలం

అన్నవరంలో ‘క్లబ్‌ మహీంద్ర’, ఎండాడలో ‘అస్కాట్‌ హోటల్స్‌’

మంత్రివర్గం ఆమోదం

విశాఖపట్నం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి):

నగరానికి మరికొన్ని ఐటీ, ఆతిథ్య రంగాలకు చెందిన కంపెనీలు రానున్నాయి. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం భూములు కేటాయించింది. ‘సిఫీ’ డేటా సెంటర్‌ను మినహాయిస్తే కొత్తగా విశాఖ రానున్న కంపెనీలు రూ.689.97 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 5,800 మందికి ఉపాధి కల్పించనున్నాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సేవల సంస్థ ఇన్ఫినిక్స్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ప్రైవేటు కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం 5.08 ఎకరాలు కేటాయించింది. రూ.170 కోట్లతో ఏర్పాటుకానున్న ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి లభించనున్నది. అలాగే సిఫీ సంస్థకు డేటా సెంటర్‌ నిమిత్తం పరదేశిపాలెంలో ఇంతకు ముందు కేటాయించిన భూమికి ఆనుకుని మరో 25 ఎకరాలు కేటాయించింది. తాము రూ.15,266 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు సిఫీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమకు అదనంగా భూములు కావాలని కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అదేవిధంగా ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు కోసం ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ కంపెనీకి రెండు ఎకరాలు భూమి కేటాయించడంతోపాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సంస్థ రూ.50 కోట్ల వ్యయంతో హెల్త్‌ టెక్‌ క్యాంపస్‌ ద్వారా వెయ్యి మందికి ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.

‘త్రిఫల ఆయుర్వేద’ బ్రాండ్‌ కింద 35 పర్యావరణహితమైన గదులు, వెలెనెస్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి విజయనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీకి అనుమతులు, రాయితీలు మంజూరుచేసింది. అలాగే భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలో అన్నవరంలో ‘క్లబ్‌ మహీంద్ర’ త్రీస్టార్‌ హోటల్‌, సమావేశ మందిరం నిర్మాణానికి అవసరమైన భూమి, రాయితీలు కల్పించింది. అదేవిధంగా మధురవాడలో రూ.163.36 కోట్లతో 4.39 ఎకరాల్లో ప్రమోద్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ బ్రాండ్‌ పేరుతో హోటల్‌ నిర్మాణానికి శ్రీదుర్గా కాన్‌దేవ్‌ ప్రైవేటు లిమిటెట్‌కు అనుమతితోపాటు రాయితీలు కల్పించింది. ఎండాడలో అంతర్జాతీయ ఖ్యాతి గల అస్కాట్‌ హోటల్స్‌ బ్రాండ్‌ పేరుతో త్రీస్టార్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి వైట్‌ ఓక్‌ రిసార్ట్స్‌ కన్సార్టియానికి భూమి ఇచ్చింది. భీమిలి సమీపాన కొత్తవలసలో పనులు ప్రారంభించిన మైరా బేవ్యూ రిసార్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు ప్రాజెక్టు బయట మరికొన్ని మౌలిక వసతులు కల్పనకు అనుమతులు మంజూరుచేశారు. గీతం విశ్వవిద్యాలయంలో 45 మీటర్లకు పైబడి భవన నిర్మాణాలకు అగ్నిమాపక శాఖ నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరుచేసింది.


సీసీఎస్‌... ఉనికి ప్రశ్నార్థకం

గతంలో సంచలన కేసుల దర్యాప్తు

నేడు చిన్న చిన్న చోరీలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడానికే పరిమితం

స్టేషన్‌లో క్రమంగా పెరుగుతున్న మహిళా సిబ్బంది

పొరుగు రాష్ర్టాలకు వెళ్లలేని పరిస్థితి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సెంట్రల్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) క్రమంగా ఉనికి కోల్పోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు సంచలన కేసులను ఛేదించి ప్రత్యేక గుర్తింపు పొందిన సీసీఎస్‌...ఇప్పుడు చిన్నపాటి చోరీ కేసుల దర్యాప్తునకే పరిమితమైపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం, ఇతర కారణాలతో రాత్రి డ్యూటీలు, నిలబడి విధులు నిర్వర్తించే డ్యూటీ చేయడానికి ఇబ్బందిపడుతున్న వారికి ఒక షెల్టర్‌ జోన్‌గా మారిందంటూ ఆ శాఖ సిబ్బందే పేర్కొంటుండడం గమనార్హం.

ప్రధాన కేసుల దర్యాప్తులో సంబంధిత అధికారులకు సహకారం అందించేందుకు వీలుగా చాలాకాలం కిందట సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో దీనికి ప్రత్యేకంగా భవనం కేటాయించారు. నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు వంటి కేసుల్లో దర్యాప్తు అధికారులకు సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, సిబ్బంది సహకరించేవారు. పదిహేనేళ్ల కిందట ఏటీఎం కేంద్రాల్లో చోరీలు, బంగారం స్మగ్లింగ్‌, రామాటాకీస్‌ థియేటర్‌ సమీపంలో హత్య, రైస్‌పుల్లింగ్‌ గ్యాంగ్‌ల మోసాలు వంటి కేసులను సీసీఎస్‌ పోలీసులే ఛేదించి శభాష్‌ అనిపించుకున్నారు. ఇప్పటివరకూ సీపీలుగా పనిచేసిన అధికారులంతా ముఖ్యమైన కేసులను సీసీఎస్‌ పోలీసులకు అప్పగిస్తుండేవారు. అయితే కొంతకాలంగా సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాధాన్యం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా సీసీఎస్‌ను పెద్దగా గుర్తించడం లేదనే ప్రచారం జరుగుతోంది.

సీసీఎస్‌లో పెరుగుతున్న మహిళా సిబ్బంది సంఖ్య

సీసీఎస్‌ అంటేనే నేరస్థుల ఆచూకీని కనిపెట్టి వారిని పట్టుకునేందుకు ఎన్నో సాహసోపేత ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మారువేషాల్లో నిందితుల కోసం వేచిచూడాల్సి ఉంటుంది. నగరంలో కూడా రాత్రి సమయంలో గస్తీలు, పెట్రోలింగ్‌లు, అనుమానితుల ఇళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కష్టతరమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కాబట్టే సీసీఎస్‌లో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలినవారంతా పురుష సిబ్బందే ఉండేవారు. కాలక్రమేణా సీసీఎస్‌లో మహిళా సిబ్బంది సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం సీసీఎస్‌లో ఒక ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు ఏఎస్‌ఐలు, ఎనిమిది మంది హెడ్‌కానిస్టేబుళ్లు, తొమ్మిది మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిలో ఒక ఉమెన్‌ ఏఎస్‌ఐ, ఆరుగురు మహిళా హెడ్‌ కానిస్టేబుళ్లు, ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. మహిళా సిబ్బందిని రాత్రి గస్తీలకు, నేరస్థులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలకు పంపించే పరిస్థితి ఉండదు కాబట్టి, వారిని సెంట్రీ పేరుతో స్టేషన్‌లోనే పగటిపూట విధులకు పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన కొద్దిమందినే నేరస్థులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలకు పంపించడం, రాత్రివేళ గస్తీలకు, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఉపయోగించుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు సంచలన కేసుల ఛేదనకు కేరాఫ్‌గా ఉన్న సీసీఎస్‌ ఇప్పుడు కొందరు సిబ్బందికి షెల్టర్‌ జోన్‌గా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సీసీఎస్‌పై దృష్టిసారించి పునఃవైభవం తెచ్చేలా ప్రక్షాళన చేయాలని సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:49 AM