Share News

కూటమిలో కుమ్ములాట!

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:12 AM

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవులకు పలుచోట్ల కూటమి పార్టీల మద్దతుదారులే ముఖాముఖి తలపడుతున్నారు.

కూటమిలో కుమ్ములాట!

  • అనేక పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికి ముఖాముఖి తలపడుతున్న టీడీపీ, జనసేన నాయకులు

  • ఒకచోట బీజేపీ, జనసేన...

  • కొన్నిచోట్ల తెలుగుదేశంలోని ఇరు వర్గాల మధ్యే పోటీ

  • మూడు పార్టీల నడుమ కింద స్థాయిలో కొరవడిన సమన్వయం

విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవులకు పలుచోట్ల కూటమి పార్టీల మద్దతుదారులే ముఖాముఖి తలపడుతున్నారు. కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య, మరికొన్నిచోట్ల టీడీపీ, జనసేన నాయకుల మధ్య పోటీ ఏర్పడింది. ఒకచోట మాత్రం జనసేన, బీజేపీ తలపడుతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలు కలిసికట్టుగా వ్యవహరించాయి. దీంతో జిల్లాలోని నాలుగు జడ్పీటీసీ స్థానాలతో పాటు నాలుగింట మూడొంతుల ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాయి. అయితే పంచాయతీ సర్పంచ్‌ పదవులకు వచ్చేసరికి పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నందున మూడు పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఇంకా గ్రామ స్థాయిలో నాయకుల మధ్య సయోధ్యకు నియోజకవర్గ నాయకులు కూడా ప్రయత్నించలేదు. దీంతో పంతాలకు పోయి టీడీపీ-జనసేన, టీడీపీలోనే రెండు వర్గాల మధ్య పోటీ నెలకొంది.

ఆనందపురం మండలం పెద్దిపాలెం సర్పంచ్‌ పదవికి టీడీపీకి చెందిన మరుపిల్లి సాయి జ్ఞానేశ్వర్‌, జనసేన నుంచి గుండు శేఖర్‌ తలపడుతున్నారు. వేములవలసలో టీడీపీకి చెందిన కోరాడ నవీన్‌ జ్ఙానేశ్వర్‌, పతివాడ సుజాత, చందక పంచాయతీలో టీడీపీ తరపున దొంతల రాజేశ్వరి, జనసేన నుంచి ఎం.రమణమ్మ పోటీ పడుతున్నారు. పాలవలసలో టీడీపీ నుంచి నిమ్మల సులోచన, నిమ్మల సోమరత్నం, రామవరంలో టీడీపీ నుంచి ఎర్రరాజుతోపాటు ఇంకొకరు బరిలో ఉన్నారు. శొంఠ్యాంలో వైసీపీ అభ్యర్థికి పోటీగా జనసేన నుంచి కోరుకొండ మూర్తి, టీడీపీ తరపున కోరుకోండ ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. భీమన్నదొరపాలెంలో సర్పంచ్‌ పదవికి పోటీ పడుతున్న జోగ నాగరాజు, ఒమ్మి దేవుడు...ఇద్దరూ టీడీపీకి చెందినవారే. ఇక లొడగలవానిపాలెంలో టీడీపీ నుంచి బమ్మిడి తారక్‌, జనసేన తరపున బమ్మిడి సురేష్‌ తలపడుతున్నారు.

పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ సర్పంచ్‌ పదవికి టీడీపీ నుంచే గనిశెట్టి వెంకటలక్ష్మి, ఇప్పిలి వెంకటలక్ష్మి, రాంపురం పంచాయతీలో వైసీపీతో పాటు టీడీపీ, జనసేన నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు. ముదపాకలో బీజేపీకి చెందిన సయ్యాద్రి రమణమ్మ, జనసేన నుంచి గొలగాని ఇంద్రాణి, గుర్రంపాలెంలో టీడీపీ నుంచి అక్కిరెడ్డి మంగ, జనసేన తరపున అక్కిరెడ్డి సంధ్యారాణి పోటీపడుతున్నారు. గొరపల్లి, పినగాడి, జంగాలపాలెంలో టీడీపీ, జనసేన అభ్యర్థులు తలపడుతున్నారు.

భీమిలి మండలం టి.నగరపాలెంలో సర్పంచ్‌ పదవికి టీడీపీ నుంచి కోరాడ రామకృష్ణ, తమ్మిన వెంకటరమణ, దాకమర్రిలో టీడీపీ నుంచి చెల్లూరి ఉమామహేశ్వరి, సంకురుభుక్త కనకం, అమనాంలో టీడీపీ నుంచి జీరు అప్పలకొండ, మనగడ సుజాత పోటీపడుతున్నారు. అన్నవరంలో టీడీపీ నుంచి ఉమ్మిడి చిన్నప్పన్న, మైలపల్లి లక్ష్మణరావు పోటీపడుతున్నారు.

పద్మనాభం మండలం పద్మనాభం సర్పంచ్‌ పదవికి టీడీపీ నుంచే తాళాడసావిత్రి, ఎర్రంనాయుడు పోటీ పడుతున్నారు. కృష్ణాపురం సర్పంచ్‌ పదవికి పొటీపడుతున్న ఎస్‌.అచ్నెన్నాయుడు, సురాల సన్యాసినాయుడు ఇద్దరు టీడీపీకి చెందినవారే. చిన్నాపురంలో వైసీపీ నుంచి ఇద్దరు వ్యక్తులు తలపడుతున్నారు.

Updated Date - Nov 29 , 2026 | 01:12 AM