గర్భిణికి తప్పని కష్టాలు
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:04 AM
Inevitable hardships for the pregnant woman
- రాత్రి వేళ టార్చ్‌లైట్ల వెలుతురులో నడిపించాల్సిన పరిస్థితి
- టెంకబుడ్డి గ్రామానికి రహదారి లేక అవస్థలు
అనంతగిరి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రహదారి సౌకర్యం లేని గ్రామాల్లో గిరిజనుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మండలంలోని కొత్తూరు పంచాయతీ టెంకబుడ్డి గ్రామానికి చెందిన కేరంగి శాంతికి సోమవారం రాత్రి 9 గంటల సమయంలో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. రాత్రి 11 గంటలకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు రాత్రి వేళ టార్చ్‌లైట్ల వెలుతురులో ఆ గర్భిణిని టెంకబుడ్డి గ్రామం నుంచి సుమారు 4 కిలోమీటర్లు నడిపించుకుంటూ కృష్ణాపురం వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గర్భిణి ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతోంది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.