Share News

ప్రాణాలు తీస్తున్న పరిశ్రమలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:48 AM

ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ప్రాణాలు తీస్తున్న పరిశ్రమలు

వరుస ప్రమాదాలతో బెంబేలు

సరైన భద్రతా చర్యలు చేపట్టని యాజమాన్యాలు

తూతూమంత్రంగా ప్రభుత్వ శాఖల తనిఖీలు

ప్రమాదాల తరువాత విచారణలు, కమిటీలతో అధికారుల కాలక్షేపం

బహిర్గతం కాని నివేదికలు

‘దక్షిణ ఎనర్జీ’ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇద్దరి మృతి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా, రసాయన పరిశ్రమల్లో పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ప్రమాదాలు జరిగిన తరువాత విచారణలు, భద్రతా సమీక్షలు జరపడం, బాధ్యులైన కంపెనీల యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు ప్రకటనలు చేయడం పరిపాటిగా మారింది. భద్రతా చర్యల్లో మాత్రం మార్పులు కానరావడం లేదు. గత ఐదేళ్ల కాలంలో ఫార్మా, రసాయన కంపెనీల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 200 మందికిపైగా మృత్యువాతపడ్డారు. మరెంతోమంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికే వరుస ప్రమాదాలతో వణికిపోతున్న పరవాడ ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో తెల్లవారుజామున మంటలు చెలరేగి, ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో పరిశ్రమల్లో భద్రతా లోపాలు మరోసారి బట్టబయలయ్యాయి.

పరవాడలోని ఫార్మా సిటీ, చుట్టుపక్కల ప్రాంతాలు, అచ్యుతాపురం సెజ్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే వాటిల్లో ప్రమాదాలు సైతం అంతే సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. 2023లో సాహితీ ఫార్మా కంపెనీలో సాల్వెంట్‌ రియాక్టర్‌లో అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. 2024 ఆగస్టు 21న అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌లో సంభవించిన భారీపేలుడులో మొత్తం 17 మంది ఉద్యోగులు, కార్మికులు మృతిచెందగా, 40 మందికిపైగా గాయపడ్డారు. అది జరిగిన మరో రెండు రోజులకే పరవాడ ఫార్మాసిటీలోని సినర్జీస్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రీడియెంట్స్‌లో ఫ్లాష్‌ఫైర్‌ సంభవించింది. నాలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. 2024 నవంబరులో పరవాడ ఫార్మాసిటీలోని ఒక ఫార్మా యూనిట్‌లో హైడ్రోక్లోరిన్‌ యాసిడ్‌, ఇతర రసాయనాల మిశ్రమ సమయంలో విషవాయువులు వెలువడి, ఒక కార్మికుడు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు.

విచారణలతో సరి

పరిశ్రమలో ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమల శాఖ, ఫ్యాక్టరీల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖలు ఆకస్మిక తనిఖీల పేరుతో హడావిడి చేస్తున్నాయి. ఆ తరువాత పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రసాయన నిల్వల నిర్వహణలో నిర్లక్ష్యం, కాలం చెల్లిన యంత్రాలు, రియాక్టర్ల వినియోగం, నిర్వహణా లోపం, భద్రతా ఆడిట్‌లను నామమాత్రంగా జరపడం, కార్మికులకు తగిన శిక్షణ లేకపోవడం, అత్యవసర స్పందన (సెన్సార్‌ అలర్ట్‌) వ్యవస్థలు లేకపోవడమే ప్రమాదాలకు కారణం. ఉత్పత్తి లక్ష్యాలను చేరుకొనే ఆత్రంలో యాజమాన్యాలు భద్రతా చర్యలను విస్మరించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రతి ప్రమాదం తరువాత అదే గోప్యత...

పారిశ్రామిక ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఉన్నతాధికారులు విచారణ కమిటీలను వేస్తున్నారు. కలెక్టర్‌, జేసీ నేతృత్వంలో ఫ్యాక్టరీలు, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, నిపుణుల బృందాలు ఘటనా స్థలాలను పరిశీలించి నివేదికలు సమర్పిస్తున్నాయి. అయితే ఆ నివేదికల్లో ఏముంది? ప్రమాదాలకు కారణాలేమిటి?, ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం జరిగింది?, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి?...వంటి కీలక అంశాలను బహిర్గతం చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో వేలాది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్న కంపెనీలు, పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలను నిరోధించడానికి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఆథారిటీ, రియల్‌టైమ్‌ మానటరింగ్‌ వ్యవస్థ, స్వతంత్ర భద్రతా ఆడిటర్లు, అత్యాధునిక యంత్రాలతో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:48 AM