ప్రాణాలు తీస్తున్న పరిశ్రమలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:09 AM
జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ పలువురు ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఫార్మా, రసాయన పరిశ్రమల్లో పేలుళ్లు, అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ప్రమాదాలు జరిగిన తరువాత విచారణలు, భద్రతా సమీక్షలు జరపడం, బాధ్యులైన కంపెనీల యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు ప్రకటనలు చేయడం పరిపాటిగా మారింది.
వరుస ప్రమాదాలతో ఉద్యోగులు, కార్మికుల్లో భయాందోళన
సరైన భద్రతా చర్యలు చేపట్టని యాజమాన్యాలు
తూతూమంత్రంగా ప్రభుత్వ యంత్రాంగం తనిఖీలు
ప్రమాదాల తరవాత విచారణలు, కమిటీలతో అధికారుల కాలక్షేపం
బహిర్గతం కాని నివేదికలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ పలువురు ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఫార్మా, రసాయన పరిశ్రమల్లో పేలుళ్లు, అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ప్రమాదాలు జరిగిన తరువాత విచారణలు, భద్రతా సమీక్షలు జరపడం, బాధ్యులైన కంపెనీల యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు ప్రకటనలు చేయడం పరిపాటిగా మారింది. పరిశ్రమల్లో భద్రతా చర్యల్లో మార్పులు కానరావడం లేదు. గత ఐదేళ్ల కాలంలో ఒక్క ఫార్మా, రసాయన కంపెనీల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 200 మందికిపైగా మృత్యువాతపడ్డారు. మరెంతోమంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికే వరుస ప్రమాదాలతో వణికిపోతున్న పరవాడ ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో తెల్లవారుజామున మంటలు చెలరేగి, ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో పరిశ్రమల్లో భద్రతా లోపాలు మరోసారి బట్టబయలయ్యాయి.
జిల్లాలో అచ్యుతాపురం సెజ్, పరవాడలోని విశాఖ ఫార్మా సిటీ, చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా శరవేంగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. వీటిల్లో ప్రమాదాలు సైతం అంతే పెరిగిపోతున్నాయి. 2023లో సాహితీ ఫార్మా కంపెనీలో సాల్వెంట్ రియాక్టర్‌లో అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. 2024 ఆగస్టు 21న అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్‌లో సంభవించిన భారీ పేలుడు యావత్ రాష్ట్రాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ఉద్యోగులు, కార్మికులు మృతిచెందగా, 40 మందికిపైగా గాయపడ్డారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఇదొకటిగా చెప్పాలి. ఇది జరిగిన మరో రెండు రోజుల్లో పరవాడ ఫార్మాసిటీలోని సినర్జీస్ యాక్టివ్ ఇన్‌గ్రీడియెంట్స్‌లో ఫ్లాష్‌ఫైర్ సంభవించింది. నాలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. 2024 నవంబర్‌లో పరవాడ ఫార్మాసిటీలోని ఒక ఫార్మా యూనిట్‌లో హైడ్రోక్లోరిన్ యాసిడ్, ఇతర రసాయనాల మిశ్రమ సమయంలో విషవాయువులు వెలువడి, ఒక కార్మికుడు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు.
విచారణలతో సరి
ఎక్కడైనా పరిశ్రమలో ప్రమాదం జరిగితే.. వెంటనే పరిశ్రమల శాఖ, ఫ్యాక్టరీల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖలు ఆకస్మిక తనిఖీల పేరుతో హడావిడి చేస్తుంటాయి. ప్రమాదానికి కారణాలు తెలుసుకొని బాఽధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించి వెళ్లిపోతుంటారు. పారిశ్రామిక భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం రసాయన నిల్వల నిర్వహణలో నిర్లక్ష్యం, కాలం చెల్లిన యంత్రాలు, రియాక్టర్ల వినియోగం, భద్రతా ఆడిట్‌లను నామమాత్రంగా జరపడం, కార్మికులకు తగిన శిక్షణ లేకపోవడం, అత్యవసర స్పందన (సెన్సార్ అలెర్ట్) వ్యవస్థలు లేకపోవడమే ప్రమాదాలకు కారణాలుగా తెలుస్తున్నది. ఉత్పత్తి లక్ష్యాలను చేరుకొనే ఆత్రంలో భద్రతా చర్యలను విస్మరించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రతి ప్రమాదం తరువాత అదే గోప్యత...
పారిశ్రామిక ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఉన్నతాధికారులు విచారణ కమిటీలను వేస్తున్నారు. కలెక్టర్, జేసీ నేతృత్వంలో ఫ్యాక్టరీలు, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, నిపుణుల బృందాలు ఘటనా స్థలాలను పరిశీలించి నివేదికలు సమర్పిస్తున్నాయి. అయితే ఆ నివేదికల్లో ఏముంది? ప్రమాదాలకు కారణాలేమిటి? ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం జరిగింది? భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? వంటి కీలక అంశాలను బహిర్గతం చేయడంలేదు. గతంలో వివిధ పరిశ్రమలు, ఫార్మా కంపెనీల్లో జరిగిన ప్రమాదాలపై చేపట్టిన విచారణ నివేదికలు ఇంతవరకు పూర్తిస్థాయిలో బహిర్గతం చేయలేదని కార్మికులు చెబుతున్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాల్లో వందలాది పరిశ్రమలు,
వేలాది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్న కంపెనీలు, పరిశ్రమల్లో తరచూ జరుగున్న ప్రమాదాలను నిరోధించడానికి ప్రత్యేక ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆథారిటీ, రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థ, స్వతంత్ర భద్రతా ఆడిటర్లు, అత్యాధునిక యంత్రాలతో అగ్నిమాక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.