పారిశ్రామిక రంగం పరుగులు
ABN , Publish Date - Feb 27 , 2026 | 01:11 AM
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంగా అచ్యుతాపురం గుర్తింపు పొందింది. ఇప్పుడు రాంబిల్లి మండలానికి పరిశ్రమల రాక ప్రారంభమైంది. ఈ మేరకు అవసరమైన భూముల ఎంపిక, మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఐఐసీ అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేశారు.
అచ్యుతాపురం సెజ్‌లో పెట్టుబడుల వెల్లువ
రూ.48 వేల కోట్ల పెట్టుబడులు
ఇప్పటికే పనులు ప్రారంభించిన పలు కంపెనీలు
రూ.2,300 కోట్లతో బ్లూ జెట్ హెల్త్ కేర్ ఫార్మా
శంకుస్థాపన రేపు
హాజరు కానున్న మంత్రి నారా లోకేశ్
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంగా అచ్యుతాపురం గుర్తింపు పొందింది. ఇప్పుడు రాంబిల్లి మండలానికి పరిశ్రమల రాక ప్రారంభమైంది. ఈ మేరకు అవసరమైన భూముల ఎంపిక, మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఐఐసీ అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్‌లో రూ.5,630 కోట్లతో లారస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో భారీ ఫార్మా జోన్‌ను అభివృద్ధి చేశారు. ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. దీని ద్వారా 6,350 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. అలాగే రూ.11 వేల కోట్ల అంచనా వ్యయంతో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకాబోతోంది. ఈ కంపెనీలో 1,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఇంకా రూ.2,700 కోట్లతో ఏర్పాటుచేయనున్న జూపిటర్ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ కేంద్రానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. రూ.3,990 కోట్లతో రెన్యూ ఫోటో వాల్టాయిక్స్ కంపెనీ సోలార్ ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఇదే సెజ్‌లో అదానీ డేటా సెంటర్ ఏర్పాటు కానున్నది. దీంతోపాటు లిథియం, ఐయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీకి ప్రభుత్వం భూమి కేటాయించింది. సుమారు రూ.8,175 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
రూ.2,300 కోట్లతో బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఫార్మా....
ప్రముఖ ఫార్మా సంస్థ ‘బ్లూజెట్ హెల్త్‌కేర్’ 102.48 ఎకరాల్లో ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్టు డెవలప్‌మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుచేయనున్నది. అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్‌లో ఈ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించింది. ఫేజ్-1 పనులను రూ.1,260 కోట్లతో 2027 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫేజ్-2, ఫేజ్-3 కింద మిగిలిన పనులు 2031 అక్టోబరు నాటికి పూర్తిచేస్తుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 1,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. బ్లూ జెట్ హెల్త్ కేర్ కంపెనీకి శనివారం రాష్ట్ర విద్యా, ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ రాంబిల్లిలో భూమి పూజ చేయనున్నారు.
ఎంఎస్‌ఎంఈ పార్కులు
అచ్యుతాపురం, రాంబిల్లి పారిశ్రామిక ప్రాంతంలో అనేక చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సెజ్‌లో ప్లాట్‌లు కొనుగోలు చేసి, ఫార్మా, ఇతరత్రా పరిశ్రమలకు అనుబంధంగా చిన్న, మధ్యతరగతి యూనిట్లను ఏర్పాటుచేస్తున్నారు. సెజ్‌లో ఆరు ఎంఎస్‌ఎంఈలు ప్రారంభమైనట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకా మరికొన్ని ఇక్కడ ఏర్పాటు కానున్నాయి.
పారిశ్రామిక అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం
విజయకృష్ణన్, కలెక్టర్
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా నక్కపల్లిలో మిట్టల్ స్టీల్, బల్క్ డ్రగ్ పార్కులు వస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లో రెండేళ్లలో సుమారు రూ.40 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం భూములు కేటాయించింది. కొన్ని పరిశ్రమల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.