Share News

పారిశ్రామిక ప్రగతి

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:45 AM

పారిశ్రామిక ప్రగతిలో అనకాపల్లి జిల్లా దూసుకుపోతున్నది.

పారిశ్రామిక ప్రగతి

రాష్ట్రస్థాయిలో జిల్లాకు మూడో స్థానం

గత ఏడాదితో పోలిస్తే 14.52 శాతం వృద్ధిరేటు

‘బంగారు కుటుంబ’ సర్వేలో టాప్‌

నిర్మాణ పనుల్లో వేగవంతంతో మూడో స్థానం

మరికొన్ని రంగాల్లో మెరుగైన ర్యాంకులు

ప్రభుత్వ పనితీరు సూచికల్లో మాడుగుల నియోజకవర్గానికి ఏ ప్లస్‌ గ్రేడ్‌

స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, వ్యవసాయం, సేవా రంగాల్లో వెనుకబాటు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పారిశ్రామిక ప్రగతిలో అనకాపల్లి జిల్లా దూసుకుపోతున్నది. అమరావతిలో సోమవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో విడుదల చేసిన నివేదిక జిల్లా పనితీరును వెల్లడించింది. పరిశ్రమలు, సంక్షేమం, పారిశుధ్యం... ఇలా పలు కీలక రంగాల్లో అనకాపల్లి జిల్లా రాష్ట్రస్థాయిలో మెరుగైన ర్యాంకులను సాధించింది. ముఖ్యంగా ‘బంగారు కుటుంబం’ సర్వేలో జిల్లా యంత్రాంగం కనబరిచిన పనితీరుకు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవా రంగంలో వెనుకబడి వుండడం ఒకింత నిరాశ పరిచింది.

పారిశ్రామిక ప్రగతిలో 3వ స్థానం

పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం, తిరుపతి జిల్లాల తర్వాత అనకాపల్లి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. 2024-25లో రూ.25,560 కోట్లతో రాష్ట్రంలో 3వ స్థానంలో వుండి, 5.55 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇక 2025-26లో మరింత మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ ఏడాది అంచనాల ప్రకారం రూ.29,271 కోట్లతో మూడో స్థానాన్ని నిలబెట్టుకొని ఏకంగా 14.52 శాతం వృద్ధిరేటు సాధించింది.

బంగారు కుటుంబం సర్వేలో మొదటి స్థానం

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘బంగారు కుటుంబం’ సర్వేకి సంబంధించి లబ్ధిదారుల వెరిఫికేషన్‌లో అనకాపల్లి జిల్లా రికార్డు సృష్టించింది. లక్ష్యంలో 61.35 శాతం వెరిఫికేషన్‌ పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా 60.03 శాతం, శ్రీకాకుళం జిల్లా 22.06 శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా 1.25 శాతంతో 16వ స్థానంలో వుండడం గమనార్హం.

నిర్మాణ పనుల్లో వేగవంతం

ప్రభుత్వ నిర్మాణ పనుల (సివిల్‌ వర్క్స్‌)కు సంబంధించి అనకాపల్లి జిల్లాకు మంచి స్థానమే దక్కింది. రాష్ట్ర సగటు పెండెన్సీ (పనులు మిగిలి ఉన్న శాతం) 69.89 శాతం కాగా అనకాపల్లి జిల్లా పెండెన్సీ 59.28 శాతం మాత్రమే. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుతో జిల్లా మెరుగైనా స్థానంలో నిలిచింది. తక్కువ పెండెన్సీ ఉండడం ద్వారా పనులు వేగంగా పూర్తి చేస్తున్న జిల్లాల జాబితాలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల తర్వాత అనకాపల్లి మూడో స్థానంలో వుంది.

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో చెత్త నిర్వహణలో 100/100 మార్కులు పడ్డాయి. 96.23 సామర్థ్యంతో ఈ విభాగంలో జిల్లా టాప్‌లో నిలిచింది. అలాగే తడి, పొడి చెత్త వేరుచేయడంలో 98.11 శాతం సాధించింది.

రహదారి భద్రత: రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో అనకాపల్లి జిల్లాకు వంద స్కోర్‌ దక్కింది. అనకాపల్లి, అనంతపురం జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో వున్నాయి.

విద్యారంగం ప్రగతిలో 5వ ర్యాంకు: గత ఏడాది ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్ధులు సత్తా చాటారు. 78.79 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

హస్తకళలకు ప్రోత్సాహం: సంకల్ప కార్యక్రమం కింద ఇంటికో పారిశ్రామికవేత్త కావాలని అన్న ఆశయ సాధన దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లా నుంచి ఏటికొప్పాక బొమ్మలు, తాటి ఆకు ఉత్పత్తులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించి 12 మంది, తాటి ఆకు ఉత్పత్తులకు సంబంధించి 9 మంది సరఫరాదారులను గుర్తించారు.

పూడిమడక ఫిషింగ్‌ హార్బర్‌ అప్‌గ్రేడ్‌: అచ్యుతాపురం మండలం పూడిమడకలో నిర్మిస్తున్న ఫిషింగ్‌ హార్బర్‌ను కోస్టల్‌ బెర్త్‌తో కలిపి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సవరించారు. దీని కోసం రూ.700 కోట్లు కేటాయింపులకు ప్రతిపాదనలు చేశారు.

మాడుగులకు ఏ ప్లస్‌ గ్రేడ్‌: ప్రభుత్వ పనితీరు సూచికల్లో (కేపీఎల్‌ఎస్‌) అనకాపల్లి జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం అద్భుత ప్రదర్శన చూపింది. 91 స్కోరుతో ఏ ఫ్లస్‌ గ్రేడ్‌ సాధించి, రాష్ట్రంలో అత్యుత్తమ నియోజకవర్గాల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

కొన్ని రంగాల్లో వెనుకబాటు...

స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవా రంగంలో అనకాపల్లి జిల్లా బాగా వెనుకబడి వుంది. జిల్లా స్థూల ఉత్పత్తి (డీడీపీఏ)లో అనకాపల్లి జిల్లా 14వ స్థానంలో వుంది. 2024-25లో రూ.52,891 కోట్లుతో 9.17 శాతం వృద్ధి రేటు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం డీడీపీఏ రూ.60,146 కోట్లు కాగా వృద్ధి రేటు 13.52 శాతంగా వుంది.

తలసరి ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఒకింత మెరుగు పడింది. 2024-25లో తలసరి ఆదాయం రూ.2,40,708తో రాష్ట్రంలో 16వ స్థానంలో వుంది. వృద్ధి రేటు 9.05 శాతంగా నమోదైంది. ఇక 2025-26లో (అంచనా) రూ.2,73,210తో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 15వ స్థానానికి ఎగబాకింది. వృద్ధి రేటు 13.05 శాతానికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది నాలుగు శాతం అధికం.

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అనకాపల్లి జిల్లా నిరాశాజనకంగా వుంది. 2024-25లో రూ.10,556 కోట్లతో రాష్ట్రంలో 23వ స్థానంలో వుంది. వృద్ధి రేటు 11.79 శాతం. ఇక 2025-26లో కూడా పెద్దగా పురోగతి సాధించలేదు. ఈ ఏడాది సైతం రూ.11,554 కోట్లతో 23వ స్థానంలోనే కొనసాగింది. వృద్ధి రేటు 9.47 శాతానికి పడిపోయింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా కన్నా వెనుకబడి వుండడం గమనార్హం

సేవా రంగంలో సైతం అనకాపల్లి జిల్లా బాగా వెనుకబడి వుంది. 2024-25లో రూ.12,888 కోట్లతో రాష్ట్రంలో 21 స్థానంలో వుంది. వృద్ధి రేటు 13.77 శాతంగా నమోదైంది. 2025-26లో రూ.14,621 కోట్లకు పెరిగినప్పటికీ రాష్ట్రంస్థాయిలో 21 స్థానంలోనే కొనసాగింది. వృద్ధి రేటు 21 శాతంగా నమోదైంది.

Updated Date - Feb 10 , 2026 | 01:45 AM