Share News

అందుబాటులో ఇంద్రావతి

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:48 AM

జిల్లాలో గిరిజన రైతులు సంప్రదాయ పంటగా సాగుచేసే రాగిలో అత్యధిక దిగుబడి, మెండైన పోషక విలువలు కలిగిన ఇంద్రావతి నూతన వంగడాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యవసాయ శాఖ గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నది.

అందుబాటులో ఇంద్రావతి
ఇంద్రావతి రాగి పంట (ఫైల్‌)

90 శాతం రాయితీపై రైతులకు నూతన రాగి వంగడం పంపిణీ

- అధిక దిగుబడి, మెండైన పోషక విలువలు

- జిల్లాలో 15 వేల హెక్టార్లలో సాగు

- మరో ఐదు వేల హెక్టార్ల పెంపునకు ప్రణాళిక

చింతపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన రైతులు సంప్రదాయ పంటగా సాగుచేసే రాగిలో అత్యధిక దిగుబడి, మెండైన పోషక విలువలు కలిగిన ఇంద్రావతి నూతన వంగడాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యవసాయ శాఖ గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నది. ఈ వంగడాలను చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి గిరిజన ప్రాంతానికి అత్యంత అనుకూలంగా సిఫారసు చేశారు. దేశ వ్యాప్తంగా చిరుధాన్యాల ఆహార ఉత్పత్తుల డిమాండ్‌ పెరగడంతో ఆదివాసీల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా రాగి సాగును విస్తరించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది.

పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రాగి పంటను 15,217 హెక్టార్లలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్నారు. పదేళ్ల కిందట సుమారు 20 వేల హెక్టారుల్లో రాగి పంటను సాగుచేసేవారు. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేక, దేశవాళీ రకాలతో అధిక దిగుబడులు రాకపోవడం వల్ల కాలక్రమంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. దీంతో గిరిజన ప్రాంతంలో రాగి సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నాణ్యమైన ‘ఇంద్రావతి’ విత్తనాన్ని గిరిజన రైతులకు పరిచయం చేసేందుకు 2018-2022 వరకు పరిశోధనలు నిర్వహించి గిరిజన ప్రాంతానికి అనువైన వంగడంగా నిర్ధారించారు. తాజాగా కూటమి ప్రభుత్వం గిరిజన రైతులకు మేలిజాతి విత్తనాలను అందజేసేందుకు రాయితీపై ‘ఇంద్రావతి’ని పంపిణీ చేస్తోంది. ఈ ఖరీఫ్‌ సాగులో వ్యవసాయశాఖ 260 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు 90 శాతం రాయితీపై పంపిణీ చేసింది. ఇప్పటికే గిరిజన రైతులు ఈ నూతన రాగి వంగడాలను పంట పొలంలో నాట్లు వేసుకున్నారు.

ఇంద్రావతి ప్రత్యేకతలు

ఇంద్రావతి వంగడాన్ని విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ వంగడాలపై వివిధ పరీక్షలు నిర్వహించి నాట్లుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంద్రావతి రాగిని చింతపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలోనూ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపట్టి ఉత్తమ ఫలితాలు సాధించారు. 115-120 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 14-15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రధానంగా రాగి పంటలో ఎదురయ్యే అగ్గితెగులు సమస్యను తట్టుకుంటుంది.

Updated Date - Jul 24 , 2026 | 12:48 AM