Share News

ఆరిలోవలో రూ.14 కోట్లతో ఇండోర్‌ స్టేడియం

ABN , Publish Date - Jan 01 , 2026 | 01:08 AM

తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవలో రూ.14 కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్టు ఎంపీ ఎం.శ్రీభరత్‌ వెల్లడించారు. 2025 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి పనులు తెలిపేందుకు ఆయన పాండురంగాపురంలోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే జోన్‌ కార్యాలయం ప్రారంభంతో పాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఒకటి, రెండు నెలల్లో వచ్చేలా ప్రయత్నిస్తున్నామన్నారు.

ఆరిలోవలో రూ.14 కోట్లతో  ఇండోర్‌ స్టేడియం

ఆనందపురం జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్యకు త్వరలో పరిష్కారం

ఒకటి, రెండు నెలల్లో రైల్వే జోన్‌ గెజిట్‌ నోఫికేషన్‌

ఎంపీ ఎం.శ్రీభరత్‌

విశాఖపట్నం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి):

తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవలో రూ.14 కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్టు ఎంపీ ఎం.శ్రీభరత్‌ వెల్లడించారు. 2025 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి పనులు తెలిపేందుకు ఆయన పాండురంగాపురంలోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే జోన్‌ కార్యాలయం ప్రారంభంతో పాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఒకటి, రెండు నెలల్లో వచ్చేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఆనందపురం జంక్షన్‌లో వాహనాలు కిందికి వెళ్లకుండా పైనుంచి వెళ్లిపోయేలా ర్యాంపు నిర్మితం కానున్నదని, దీనిపై నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేవారికి ఇబ్బంది లేకుండా వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కలిసి ఎనిమిది రహదారులు నిర్మిస్తున్నాయన్నారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారులను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విశాఖ వచ్చే పర్యాటకులకు అన్ని వసతులు సమకూరుస్తామని, ఆర్‌కే బీచ్‌, కైలాసగిరి, జూ, కంబాలకొండలను కలుపుతూ అభివృద్ధికి ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పెట్టుబడిదారులను జగన్‌ భయపెడుతున్నారని, ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము సంపద సృష్టి, అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, విశాఖను టూరిజం, ఐటీ, స్పిరిచ్యువల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అలజడికి గురైన విశాఖపట్నం కూటమి పాలనలో ప్రశాంతంగా అభివృద్ధి కేంద్రంగా మారిందన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్లలో ఒక్క డీఎస్‌సీ కూడా నిర్వహించలేదని, కూటమి వచ్చీ రావడంతోనే మెగా డీఎస్‌సీ నిర్వహించిందని, ప్రతి ఏటా నిర్వహిస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించారన్నారు. త్వరలోనే మండల కేంద్రాల్లో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయన్నారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ యోగాను కూడా జగన్‌ వృథా అని విమర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ తాగునీటి సమస్య లేకుండా కణితి నుంచి ఆరిలోవ మీదుగా మధురవాడకు రూ.595 కోట్లతో మంచినీటి పథకం నిర్మిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ, వైసీపీ ట్రూఅప్‌ పేరుతో తొమ్మిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్‌ పేరుతో విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తోందన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 01:08 AM