Share News

పంచదార్లలో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వకాలు

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:28 PM

మండలంలోని పంచదార్ల సమీపంలో గ్రావెల్‌ కోసం కొండలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

పంచదార్లలో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వకాలు
గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు

ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు

శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం

వైసీపీ నేతలతో కలిసి ‘చలో పంచదార్ల’ కార్యక్రమం

రాంబిల్లి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పంచదార్ల సమీపంలో గ్రావెల్‌ కోసం కొండలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ఉమా ధర్మలింగేశ్వరస్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పంచదార్ల ఫణిగిరి కొండపై గ్రావెల్‌ తవ్వకాలను నిరసిస్తూ వైసీపీ నాయకులు మంగళవారం ‘చలో పంచదార్ల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బొత్సతోపాటు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు, నాయకులు గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ, బీవీ సత్యవతి, జె.సుభద్ర, బొడ్డేడ ప్రసాద్‌, తదితరులు కలిసి గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం వెంకటాపురం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ,పంచదార్లను ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటించాలని జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారని, కానీ అందుకు విరుద్ధంగా గనుల శాఖ అధికారులు ఇక్కడ మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం దారుణమని అన్నారు. తక్షణమే పంచదార్లను ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఇక్కడ ఐదు ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు తీసుకొని 50 ఎకరాల్లో తవ్వకాలు జరిపారని ఆరోపించారు. అనుమతులకు మించి గ్రావెల్‌ తవ్విన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ, పంచదార్ల కొండలను ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటిస్తూ ఉత్వర్వులు జారీ చేసే వరకు వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, ఉమాధర్మలింగేశ్వరస్వామి ఆలయానికి అత్యంత చేరువలో భారీ ఎత్తున గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతూ, ఆలయ పవిత్రతను, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కంబాల జోగులు, రేగం మత్స్యలింగం, అదీప్‌రాజ్‌, పసుపులేటి బాలరాజు, కుంభా రవిబాబు, కేకే రాజు, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, పెట్ల గణేశ్‌, తైనాల విజయ్‌కుమార్‌, ధూళి నాగరాజు, పి.కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:28 PM