Share News

వైద్య శాఖలో అక్రమాలపై లోతుగా విచారణ

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:39 AM

స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జరిగిన అక్రమాలపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సస్పెన్షన్‌కు గురైన డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్‌కు సహకరించిన ముగ్గురు ఉద్యోగులపై విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణాధికారిగా విశాఖపట్నం జోనల్‌ మలేరియా అధికారిని నియమించారు.

వైద్య శాఖలో అక్రమాలపై లోతుగా విచారణ
డీఎంహెచ్‌వో కార్యాలయం ఉండే ఐటీడీఏ కార్యాలయ సముదాయం

- డీఎంహెచ్‌వో కార్యాలయంలోని ముగ్గురు అధికారులపై విచారణకు ఆదేశం

- డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్‌కు సహకరించారని ఆరోపణలు

- విచారణాధికారిగా జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ ప్రభావతి

పాడేరు, జూలై 23(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జరిగిన అక్రమాలపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సస్పెన్షన్‌కు గురైన డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్‌కు సహకరించిన ముగ్గురు ఉద్యోగులపై విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణాధికారిగా విశాఖపట్నం జోనల్‌ మలేరియా అధికారిని నియమించారు. డీఎంహెచ్‌వోగా పని చేసిన కృష్ణమూర్తి నాయక్‌ వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది అక్రమ డిప్యూటేషన్లు, కాంట్రాక్ట్‌ సిబ్బంది వద్ద లంచాలు వసూలు, వైద్య సిబ్బందికి సంబంధించిన ప్రతి పనికి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, చట్టవ్యతిరేకమైన పనులు చేశారనే అభియోగంపై సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే ఆయనకు సీసీగా పని చేసిన కిరణ్‌పట్నాయక్‌, సీనియర్‌ అసిస్టెంట్లు డి.శ్రీనివాసరావు. వి.కిరణ్‌కుమార్‌లు సైతం కృష్ణమూర్తినాయక్‌ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై ప్రజా సంఘాలకు చెందిన రామారావుదొర, కె.కామరాజు ఫిర్యాదులు చేయడంతో పాటు, ఈ ఏడాది మే 21న విశాఖపట్నంలో నిర్వహించిన విచారణలోనూ అనేక మంది అక్రమాలపై ఆధారాలు అందజేశారు. ఈ తరుణంలో పైన పేర్కొన్న ముగ్గురు వైద్య ఉద్యోగులపై విచారణ చేపట్టాలని విశాఖపట్నం జోనల్‌ మలేరియా అధికారి ప్రభావతిని విచారణాధికారిగా నియమిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాధారాణి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jul 24 , 2026 | 12:39 AM