Share News

డుంబ్రిగుడలో స్వతంత్రుల దూకుడు

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:38 PM

జిల్లాలోని అన్ని మండలాలతో పోల్చితే డుంబ్రిగుడ ఎంపీపీ ఎన్నిక వ్యవహారం ఉత్కంఠగా మారింది. వాస్తవానికి ఎక్కడైనా అధికార, విపక్ష పార్టీలు ఎంపీపీ పదవిని దక్కించుకోవడానికి పోటీ పడుతుండడం సహజం. కాని ఇక్కడ అందుకు భిన్నంగా ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు సైతం ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.

డుంబ్రిగుడలో స్వతంత్రుల దూకుడు
డుంబ్రిగుడ మండల పరిషత్‌ కార్యాలయం

ఉత్కంఠగా ఎంపీపీ వ్యవహారం

కూటమి, వైసీపీలకు దక్కని మెజారిటీ

మొత్తం 14 ఎంపీటీసీలకు కూటమికి 4, వైసీపీకి 5, స్వతంత్రులకు 5 స్థానాలు

ఎంపీపీ పదవి కోసం కూటమి, వైసీపీ, స్వతంత్రులు పైరవీలు

డుంబ్రిగుడ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు గానూ టీడీపీ-3, వైసీపీ-5, స్వతంత్రులు-5, బీజేపీ-1 స్థానం గెలుపొందింది. స్వతంత్రుల్లో ముగ్గురు వైసీపీ, ఇద్దరు టీడీపీ రెబల్స్‌ ఉన్నారు. మండలంలో ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు ఎవరికి మద్దతు తెలిపితే వారే ఎంపీపీ అవుతారు. కాని వైసీపీకి 5, కూటమి 4 స్థానాలకే పరిమితం కావడంతో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు స్వతంత్రుల మద్దతుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే అనుహ్య రీతిలో స్వతంత్రుల్లో ఉన్న సభ్యులు ఇటు కూటమి నుంచి, అటు వైసీపీ నుంచి కలిపి ముగ్గురు సభ్యుల మద్దతు కూడగట్టి ఎంపీపీ కావాలనే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తుండడం ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి వైసీపీలో ఐదుగురు, స్వతంత్రులు ఐదుగురు కలిసి ఎంపీపీ, వైస్‌ఎంపీపీ పదవులను పొందుతారని తొలుత భావించినప్పటికీ, కొందరు అధికార పార్టీ వైపు చూస్తుండడంతో కూటమితో జతకట్టి టీడీపీ ఎంపీపీ, స్వతంత్రులు వైస్‌ఎంపీపీ అవుతారని తర్వాత భావించారు. కాని అందుకు భిన్నంగా స్వతంత్రులే ప్రస్తుతం చక్రం తిప్పుతూ తమకు మద్దతు ఇచ్చే వారికి వైస్‌ ఎంపీపీ ఇస్తామని, తాము ఎంపీపీ పదవి పొందుతామని ప్రధాన పార్టీలకు ఆఫర్‌ ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏమీ చేయాలో అర్థం కాక కూటమి, వైసీపీ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఈక్రమంలో మండలంలో ఎంపీపీ పదవి ఎవరిని వరిస్తుందో ఊహించడం కష్టంగా మారిందని రాజకీయ పార్టీలు అంటున్నాయి.

Updated Date - Nov 14 , 2026 | 10:38 PM