స్వతంత్ర ఎంపీటీసీని వరించిన పీఠం
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:01 AM
మండల పరిషత్ అధ్యక్షుడిగా జీకేవీధి-1 స్వతంత్ర ఎంపీటీసీ సభ్యుడు పూజారి లీలాప్రసాద్, వైస్ ఎంపీపీగా ధారకొండ ఎంపీటీసీ సభ్యురాలు బాకూరి రాజేశ్వరి(వైసీపీ) ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి బాబూనాయక్ ప్రకటించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి నిర్వహించారు.
- ఎంపీపీగా పూజారి లీలాప్రసాద్ ఎన్నిక
గూడెంకొత్తవీధి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్ అధ్యక్షుడిగా జీకేవీధి-1 స్వతంత్ర ఎంపీటీసీ సభ్యుడు పూజారి లీలాప్రసాద్, వైస్ ఎంపీపీగా ధారకొండ ఎంపీటీసీ సభ్యురాలు బాకూరి రాజేశ్వరి(వైసీపీ) ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి బాబూనాయక్ ప్రకటించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి నిర్వహించారు. కోరం సరిపడడంతో వైసీపీకి చెందిన 14 మంది ఎంపీటీసీ సభ్యులు, జనసేనకు చెందిన ఇద్దరు, టీడీపీకి చెందిన ఒకరు, స్వతంత్ర ఎంపీటీసీ సభ్యుడితో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి ప్రారంభించి, వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా జీకేవీధి-3 ఎంపీటీసీ సభ్యుడు బొబ్బిలి లక్ష్మణ్‌కి పార్టీ బీఫారం వచ్చిందని, ఎవరైనా ఇతరులు ఎంపీపీగా పోటీ చేస్తారా? అని సభ్యులను అడిగారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు జీకేవీధి-1 ఎంపీటీసీ సభ్యుడు పూజారి లీలా ప్రసాద్ ప్రకటించారు. మొత్తం 18 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను బొబ్బిలి లక్ష్మణ్‌కు ఆయనతో పాటు మరో ఐదుగురు చేతులెత్తి ఓటు వేశారు.
స్వతంత్ర అభ్యర్థి పూజారి లీలాప్రసాద్‌కి అతనితో పాటు వైసీపీకి చెందిన మరో ఏడుగురు, టీడీపీకి చెందిన సంకాడ ఎంపీటీసీ సభ్యురాలు మామిడి సుభద్ర, పెదవలస స్వతంత్ర అభ్యర్థి గబులంగి విజయలక్ష్మి చేతులెత్తి ఓటు వేశారు. జనసేనకు చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఎవరికి ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు. స్వతంత్ర అభ్యర్థి లీలాప్రసాద్‌కి పది ఓట్లు రావడంతో ఆయన మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి బాబూనాయక్ ప్రకటించారు. వైస్‌ఎంపీపీగా ధారకొండ ఎంపీటీసీ సభ్యురాలు బాకూరి రాజేశ్వరికి వైసీపీ వైస్ ఎంపీపీగా పార్టీ బీఫారం వచ్చిందని, ఇతరులు ఎవరైనా వైస్ ఎంపీపీగా పోటీ చేస్తారా? అని ప్రిసైడింగ్ అధికారి అడగగా, ఎవరూ ముందుకురాలేదు. దీంతో వైస్ ఎంపీపీగా బాకూరి రాజేశ్వరి ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలో ఎంపీడీవో రమణబాబు పాల్గొన్నారు.