స్వాతంత్య్ర సంబరం
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:08 AM
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది.
నేటి వేడుకలకు సర్వం సిద్ధం
పోలీస్ బ్యారెక్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
వివిధ శాఖల శకటాల ప్రదర్శన
విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. వేడుకల కోసం పోలీస్ బ్యారెక్స్‌ను సుందరంగా తీర్చిదిద్దింది. అతిథులు, ప్రముఖులు, అధికారులు ఆశీనులయ్యేందుకు గ్యాలరీలు ఏర్పాటుచేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం ఉదయం 8.58 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే సమాచారం వచ్చింది. జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కొనసాగుతున్నప్పటికీ ఆయన ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున అక్కడ జాతీయ పతాకం ఎగురవేస్తారు. మంత్రి వర్గంలో విశాఖ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో వరుసగా మూడోసారి జాతీయ పతాకం ఎగురవేసే అవకాశం అనగాని సత్యప్రసాద్‌కు దక్కింది.
వేడుకల సందర్భంగా జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, పరిశ్రమలు, ఏపీఐఐసీ, ఐటీ, విద్య, వైద్య ఆరోగ్య, పర్యాటక, రెవెన్యూ, పౌర సరఫరాలు, ప్రజా రవాణా శాఖల శకటాల ప్రదర్శన ఉంటుంది. ఇంకా వివిధ సంక్షేమ పథకాల కింద 30,366 మంది లబ్ధిదారులకు రూ.397.33 కోట్ల విలువైన ఆస్తులు, ఆర్థిక సహాయం అందించనున్నారు. పలు శాఖలు స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నాయి. వేడుకల్లో భాగంగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. కాగా పోలీస్ బ్యారెక్స్ మైదానంలో ఏర్పాట్లను కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి పర్యవేక్షించారు.
జిల్లాలో విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ శాఖలు/సంస్థలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సుమారు 520 మందికి మంత్రి సత్యప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేస్తారు.