త్వరలో అందుబాటులోకి ఇంక్యుబేషన్ సెంటర్
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:24 PM
అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రూ.3.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బెల్లం, చిరుధాన్యాలు, పనస విలువ ఆధారిత ఉత్పత్తుల అంకుర కేంద్రం(కామన్ ఇంక్యుబేషన్ సెంటర్) త్వరలో అందుబాటులోకి రానున్నదని పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన విభాగాధిపతి డాక్టర్ పి.వి.కె.జగన్నాథరావు తెలిపారు.
బెల్లం, చిరుధాన్యాలు, పనస విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం..
అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఏర్పాటు
అనకాపల్లి అగ్రికల్చర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రూ.3.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బెల్లం, చిరుధాన్యాలు, పనస విలువ ఆధారిత ఉత్పత్తుల అంకుర కేంద్రం(కామన్ ఇంక్యుబేషన్ సెంటర్) త్వరలో అందుబాటులోకి రానున్నదని పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన విభాగాధిపతి డాక్టర్ పి.వి.కె.జగన్నాథరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక జిల్లా - ఒక ఉత్పత్తి పథకం పేరిట కేంద్ర ప్రభుత్వం దేశంలో కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ఆయా జిల్లాల్లో విరివిగా పండే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసే కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే అనకాపల్లిలో బెల్లం, చిరుధాన్యాలు, పనస విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కేంద్రం కోసం ఏడాది కిందటే కోటి రూపాయల వ్యయంతో భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు. బెల్లం విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్‌ను రూ.1.37 కోట్లతో, అలాగే రూ.66 లక్షలతో చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల యూనిట్‌ను, రూ.22 లక్షలతో పనస ఉత్పత్తుల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వీటితోపాటు రూ.25 లక్షలతో ఆహార ఉత్పత్తుల పరీక్ష ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడే యంత్ర సామగ్రి ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చేరుకుందన్నారు. ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తామన్నారు. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మిగతా వివరాలకు తనను గానీ, ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావును గానీ సంప్రతించవచ్చునని జగన్నాథరావు తెలిపారు. ఈ అంకుర కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్‌పై రైతులకు శిక్షణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు.