పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:28 AM
నగరంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. గత రెండు నెలల్లో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయారు.
జాతీయ రహదారి, బీఆర్‌టీఎస్ రోడ్లపైనే అత్యధికం
గత రెండు నెలల్లో 70 మంది మృతి
ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలం
ట్రాఫిక్ క్రమబద్ధీకరణణ గాలికి వదిలేస్తున్న వైనం
ఫొటోలు తీయడం, ఈ-చలాన్‌లు కట్టించడంలోనే నిమగ్నం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. గత రెండు నెలల్లో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని ఫొటోలు తీయడం, పెండింగ్ ఈ-చలాన్‌లను కట్టించడంలో నిమగ్నమవుతున్నారు.
నగరంలో ఏటా సగటున 1,100 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. సుమారు 350 మంది వరకు మృత్యువాతపడితే, మరో వెయ్యి మంది వరకు గాయాలపాలవుతున్నారు. ప్రమాదాల్లో అత్యధికం జాతీయ రహదారిపైనే జరుగుతున్నాయి. అనకాపల్లి నుంచి ఆనందపురం మీదుగా అనకాపల్లి వరకూ ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యింది. అయితే ఆ మార్గంలో టోల్‌గేట్‌లు ఉండడంతో భారీ వాహనాలు ఇప్పటికీ నగరం మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది నగరంలో 1,086 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 420 జాతీయ రహదారిపైనే జరిగాయి. ఆ తర్వాత బీఆర్‌టీఎస్ రోడ్డులో అత్యధికంగా 117, పోర్టు రోడ్డులో 34, నగరంలోని ప్రధాన రహదారులపై 410 ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 70 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ సంఖ్య గత ఏడాది నమోదైన మరణాల సగటుతో పోల్చితే ఎక్కువ కావడం గమనార్హం. గురువారం ఉదయం మధురవాడ నుంచి ఎండాడ వైపు వచ్చేదారిలో లా కాలేజీ జంక్షన్ వద్ద ఒక ద్విచక్ర వాహనచోదకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. రెండు రోజుల కిందట సిరిపురం జంక్షన్‌లో ఒక ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 27న రైల్వేస్టేషన్ రోడ్డులో రోడ్డు దాటుతున్న వ్యక్తి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ట్రాఫిక్ నియంత్రణ గాలికి వదిలేసిన పోలీసులు
నగరంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు కూడళ్లలో విధులు నిర్వర్తిస్తే వాహనచోదకులు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించే పరిస్థితి ఉంటుంది. క్రమపద్ధతిలో వాహనాల రాకపోకలు సాగితే ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. అయితే పోలీసులు కూడళ్లలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడాన్ని పక్కనపెట్టేసి, ఎక్కడో చెట్లపక్కన, జంక్షన్‌లకు దూరంగా ఐదు, పది మంది గుంపుగా చేరి హెల్మెట్ పెట్టనివారి కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటివారు కనిపించగానే సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి ఈ-చలాన్ జారీచేస్తున్నారు. వారితోపాటు అన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తూ వచ్చే వాహనాలను కూడా నిలిపి, పెండింగ్ చలాన్‌లు ఏమైనా ఉన్నాయా? అని తనిఖీ చేయడం, వాటిని కట్టించడంలో నిమగ్నమవుతున్నారు. సమీపంలోనే ట్రాఫిక్ జామ్ అవుతున్నాసరే కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.