ఆర్టీసీకి పెరిగిన ఆదాయం
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:21 PM
సంక్రాంతి పండగకు వచ్చి వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులను ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నడపడంతో కేవలం నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రూ.29,82,935 ఆదాయం వచ్చిందని పాడేరు డిపో మేనేజర్ పసగాడ శ్రీనివాసరావు తెలిపారు.
ఈ ఏడాది నాలుగు రోజుల్లో రూ.29,82,935
గత ఏడాది రూ.23,47,729
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడపడమే కారణం
డిపో మేనేజర్ పసగాడ శ్రీనివాసరావు
పాడేరురూరల్, జనవరి 21: సంక్రాంతి పండగకు వచ్చి వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులను ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నడపడంతో కేవలం నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రూ.29,82,935 ఆదాయం వచ్చిందని పాడేరు డిపో మేనేజర్ పసగాడ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 17వ తేదీన రూ.6,42,843 రాగా, 18న 6,20,019, అలాగే 19న 8,62,995 రాగా, 20న 8,57,078 చొప్పున ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు 4 రోజులు నడపడంతో ఆర్టీసీకి రూ.23,47,729 ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రూ.6,35,206 ఆదాయం పెరిగిందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అనునిత్యం కాంప్లెక్స్‌లో పర్యవేక్షించి రద్దీకి అనుగుణంగా సకాలంలో బస్సులను నడపడం వల్ల ఆదాయం పెరిగిందన్నారు. ప్రయాణికుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
కొనసాగుతున్న తిరుగు ప్రయాణాల రద్దీ
సంక్రాంతి పండుగ సెలవులు ముగిసిన నేపథ్యంలో తిరుగు ప్రయాణాల రద్దీ కొనసాగుతోంది. విద్యార్థులు, వలస కూలీలతో బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపుల స్టాండ్ కిటకిటలాడింది. డీఎం పసగాడ శ్రీనివాసరావు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బుధవారం విశాఖ, చోడవరం, అనకాపల్లి, అరకులోయ, చింతపల్లి ప్రాంతాలకు అదనపు సర్వీసులను ఏర్పాటు చేశారు.