పెరిగిన రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:22 AM
రిజిస్ట్రేషన్ల శాఖకు జనవరి నెలలో మంచి ఆదాయం లభించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల విలువలు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో అంతా అప్రమత్తమయ్యారు. రిజిస్ర్టేషన్ ఫీజులు తగ్గుతాయని చాలామంది అప్పటికే చేసుకున్న ఒప్పందాలన్నీ చివరి వారంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
జనవరిలో రూ.113.79 కోట్ల ఆదాయం
లక్ష్యంలో 86.4 శాతం వసూళ్లు
గత ఏడాది జనవరితో పోల్చితే 10.56 శాతం వృద్ధి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రిజిస్ట్రేషన్ల శాఖకు జనవరి నెలలో మంచి ఆదాయం లభించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల విలువలు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో అంతా అప్రమత్తమయ్యారు. రిజిస్ర్టేషన్ ఫీజులు తగ్గుతాయని చాలామంది అప్పటికే చేసుకున్న ఒప్పందాలన్నీ చివరి వారంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనవరి నెలలో రూ.131.71 కోట్ల ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఇవ్వగా అన్ని కార్యాలయాలు కలిపి రూ.113.79 కోట్లు వసూలు చేశాయి. లక్ష్యంలో 86.4 శాతం సాధించామని జిల్లా అధికారులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం రూ.1,109.36 కోట్లు కాగా అందులో ఇప్పటివరకు రూ.898.21 కోట్లు వసూలైంది. ఇది లక్ష్యంలో 80.07 శాతమని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.56 శాతం వృద్ధి రేటు నమోదైందని జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర తెలిపారు. ప్రభుత్వం భూముల విలువల పెంపును తాత్కాలికంగా వాయిదా వేయడంతో ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్వస్థితికి చేరుకున్నాయి.