ప్రచారం జాస్తి.. ఆదాయం నాస్తి
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:21 AM
అనకాపల్లి పట్టణంలో వాణిజ్య, వ్యాపార ప్రచార హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు కొంతమందికి కాసులు కురిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన ఏర్పాటు చేస్తున్న వీటి ద్వారా జీవీఎంసీకి పూర్తిస్థాయిలో ఆదాయం సమకూరడంలేదు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల లైవ్ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
అనకాపల్లిలో ఇబ్బడిముబ్బడిగా వాణిజ్య ప్రకటనల హోర్డింగులు, ఫ్లెక్సీలు, గ్లోసైన్ బోర్డులు
చాలా వాటికి జీవీఎంసీ నుంచి అనుమతులు లేని వైనం
కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు
ప్రకటనకర్తలతో జీవీఎంసీ ఉద్యోగులు కుమ్మక్కు
పట్టించుకోని ఉన్నతాధికారులు
జీవీఎంసీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి పట్టణంలో వాణిజ్య, వ్యాపార ప్రచార హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు కొంతమందికి కాసులు కురిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన ఏర్పాటు చేస్తున్న వీటి ద్వారా జీవీఎంసీకి పూర్తిస్థాయిలో ఆదాయం సమకూరడంలేదు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల లైవ్ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
అనకాపల్లి ప్రధాన వీధుల్లో భారీ ప్రచార హోర్డింగులు, రహదారుల డివైడర్లపై గ్లోసైన్ లాలీపప్ బోర్డులు, ఫ్లెక్సీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. నెహ్రూ చౌక్ నుంచి నలువైపులా.. విశాఖపట్నం, చోడవరం, కొత్తూరు, పూడిమడక రోడ్డు జంక్షన్ వైపు వెళ్లే నాలుగు ప్రధాన రహదారుల్లో వాణిజ్య ప్రకటనల బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఇంకా రైల్వే స్టేషన్ రోడ్డు, గవరపాలెం మెయిన్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి స్టేడియం మీదుగా ఏరియా ఆస్పత్రికి వెళ్లే మార్గాల్లో కూడా ప్రకటన బోర్డులు వున్నాయి. వీటి ద్వారా జీవీఎంసీకి ఏటా రూ.60 లక్షలకు పైగా ఆదాయం రావాల్సి వుంది. కానీ రూ.25 లక్షలకు మించి రావడంలేదు. జీవీఎంసీలో కొందరు ఉద్యోగులు ఫ్లెక్సీలు, గ్లోసైన్ బోర్డులు, లైవ్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటుకు అనధికారంగా అనుమతులు జారీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన వాణిజ్య ప్రకటనల హోర్డిగులు, గ్లోసైన్ బోర్డులు, ఫ్లెక్సీల్లో ఎన్నింటికి అనుమతులు వున్నాయో ఉన్నతాధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ‘తలా పాపం తిలా పిడికెడు’ అన్నట్టుగా అధికారులు సైతం తమ స్థాయికి తగిన వాటాలు పుచ్చుకుంటూ అనధికార ప్రకటన బోర్డుల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో వాణిజ్య ప్రకటనల బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలకు సంబంధించి అనుమతుల వివరాల గురించి స్థానిక అధికారులను అడిగితే.. సమాచారం మొత్తం జీవీఎంసీ కమిషనర్ వద్ద ఉంటుందని చెబుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా లైవ్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డు
అనకాపల్లిలోని నెహ్రూ చౌక్ వద్ద ఒక భవనంపై ప్రైవేటు యాడ్ ఏజెన్సీ వారు లైవ్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు డిజిటల్ స్ర్కీన్‌పై విరామం లేకుండా వ్యాపార ప్రకటనలు వస్తుంటాయి. వీటిని చూస్తూ వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అకాశం వుంది. ఈ కారణంగానే రద్దీ కూడళ్లలో లైవ్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డులకు అనుమతులు ఇవ్వరు. కానీ ఇక్కడ నెహ్రూచౌక్‌లో ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై స్థానికులు జీవీఎంసీ జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.
భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో ముప్పు
పట్టణంలో వాణిజ్య, రాజకీయ, ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు హోర్డింగులు, ఫ్లెక్సీలు, డిజిటల్ బోర్డులు, గ్రోసైన్ బోర్డులు ఏర్పాటు చేయాలంటే ముందుగా జీవీఎంసీ నుంచి అనుమతులు తీసుకోవాలి. రాజకీయ, ప్రైవేటు కార్యక్రమాలకు సంబంధించిన వాటిని గరిష్ఠంగా వారం రోజులపాటు వుంచడానికి తాత్కాలిక అనుమతులు ఇస్తారు. ఎటువంటి ఫీజు వసూలు చేయరు. కానీ ఈ తరహా ఫ్లెక్సీలు వారాలు, నెలల తరబడి అలాగే వుంటున్నాయి. పైగా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుండడంతో ఈదురుగాలులకు నేలకొరిగి, అటుగా వెళుతున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల నెహ్రూచౌక్ సమీపంలో గాజువాక బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్, ఫ్లెక్సీలు ఈదురు గాలులకు కూలిపోవడంతో అక్కడ నిలిపివున్న రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.
తనిఖీలతోనే వెలుగులోకి అక్రమాలు...
ప్రచార హోర్డింగు/ ఫ్లెక్సీ/ గ్లోసైన్ బోర్డు సైజు, వాటిని ఏర్పాటు చేసే ప్రదేశం, గడువునుబట్టి జీవీఎంసీ అధికారులు ఫీజులు వసూలుచేయాలి. కానీ ఈ వివరాలు ఏవీ సాధారణ ప్రజానీకానికి తెలియకపోవడంతో అటు ప్రకటనకర్తలు, ఇటు ఉద్యోగులు కుమ్మక్కై జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు. కొంతమంది జీవీఎంసీ నుంచి అనుమతులు తీసుకున్న వాటికన్నా పది రెట్లు ఎక్కువగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి అనకాపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వాణిజ్య, వ్యాపార ప్రకటనల హోర్డింగులు, ఫ్లెక్సీలు, గ్లోసైన్ బోర్డులపై ఆడిట్ నిర్వహిస్తే అవినీతి బాగోతం బయటపడుతుందని స్థానికులు కోరుతున్నారు.