పెరిగిన విద్యుత్ వినియోగం
ABN , Publish Date - May 23 , 2026 | 12:27 AM
వేసవి ఎండల ప్రభావంతో జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. వేసవి ప్రారంభానికి ముందున్న వినియోగంతో పోల్చితే ఇప్పుడు 15 శాతం వరకు పెరిగింది.
రోజుకు 1.66 ఎంయూల అదనపు డిమాండ్
ఏసీలు, కూలర్లు, మోటార్ల వినియోగమే కారణం
అనకాపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): వేసవి ఎండల ప్రభావంతో జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. వేసవి ప్రారంభానికి ముందున్న వినియోగంతో పోల్చితే ఇప్పుడు 15 శాతం వరకు పెరిగింది. ఈపీడీసీఎల్ అధికారుల గణాంకాల ప్రకారం వేసవి ప్రారంభానికి ముందు జిల్లాలో రోజుకు సగటున 12.68 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ వినియోగం అయ్యేది. నెల రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రస్తుతం రోజుకు 14.34 మిలియన్ యూనిట్ల చేరింది. అంటే 1.66 మిలియన్ యూనిట్లు పెరిగింది. వేసవి కారణంగా వేడి వాతావరణం, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను అధికంగా వినియోగిస్తున్నారు. ఇంకా తాగునీటి అవసరాల కోసం విద్యుత్ మోటార్ల వినియోగం పెరగడం, వాణిజ్య సముదాయాల్లో విద్యుత్ వినియోగం అధికమవడం వంటి కారణాల వల్ల డిమాండ్ పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. పెరిగిన విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈపీడీసీఎల్ ఎస్‌ఈ ప్రసాద్ తెలిపారు. అదనపు లోడు పడుతున్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి అవసరం మేరకు మరమ్మతులు, లేదా సామర్థ్యం పెంపు పనులు చేపడుతున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్య తలెత్తకుండా ఫీడర్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.