Share News

పెరిగిన పోర్టు కాలుష్యం

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:20 AM

విశాఖపట్నంలో పోర్టు కాలుష్యం ఇటీవల బాగా అధికమైంది. దీనిపై అధికారులు నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహించి పలు ఆదేశాలు ఇస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ముఖ్యంగా విశాఖపట్నం పోర్టులో కాలుష్యం తగ్గించేందుకు వ్యాపారులు సహకరించడం లేదు. అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్లనే వారు పూర్వ పద్ధతిలోనే సరకు నిల్వ, రవాణా కార్యకలాపాలు నడపుతున్నారు.

పెరిగిన  పోర్టు కాలుష్యం
సరకు నిల్వలపై అధికారులు నిషేధించిన తెలుపు ప్లాస్టిక్‌ కవర్‌

నిబంధనల ఉల్లంఘనే కారణం

స్టాక్‌యార్డుల్లో ఇష్టానుసారంగా నిల్వలు

నిషేధించిన తెల్లటి టార్పాలిన్లు వినియోగం

పరిమితికి మించి లారీల్లో లోడింగ్‌

వారం వారం తనిఖీలు ఉత్తిమాటే

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో పోర్టు కాలుష్యం ఇటీవల బాగా అధికమైంది. దీనిపై అధికారులు నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహించి పలు ఆదేశాలు ఇస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ముఖ్యంగా విశాఖపట్నం పోర్టులో కాలుష్యం తగ్గించేందుకు వ్యాపారులు సహకరించడం లేదు. అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్లనే వారు పూర్వ పద్ధతిలోనే సరకు నిల్వ, రవాణా కార్యకలాపాలు నడపుతున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ‘నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రొగ్రామ్‌’ కింద దుమ్ము ధూళి నియంత్రణ, నిబంధనలు పాటించని సరకు రవాణా వాహనాలపై భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించింది. దీనిపై విశాఖపట్నం పోర్టులో గత జూలై 17న పర్యావరణ పర్యవేక్షణ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. పోర్టులో సరకు రవాణా చేసే బీఓటీ/పీపీపీ/ఓ అండ్‌ ఎం ఆపరేటర్లంతా కమిటీ సూచించిన నిబంధనలు పాటించాలని ఆదేశించింది. పోర్టు యూజర్లు తప్పనిసరిగా కాలుష్య నివారణకు సహకరించాలని కోరింది. కొన్ని నిబందనలు పెట్టింది.

- ఎగుమతి, దిగుమతి చేసే సరకులపై స్టాక్‌ యార్డుల్లో కేవలం నీలం, పసుపు రంగు టార్పాలిన్‌తో మాత్రమే కవర్‌ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలుపు రంగు ప్లాస్టిక్‌ సంచులతో కుట్టిన టార్పాలిన్లు వినియోగించకూడదు.

- పోర్టు ఏరియాలో భూములను సరకు నిల్వ కోసం లీజుకు తీసుకునేవారు తప్పనిసరిగా అక్కడ మంచి టార్పాలిన్‌ కవర్లు ఏర్పాటు చేశామని వివరాలు సమర్పించాకే అనుమతులు ఇవ్వాలి. చినిగిపోయిన, కత్తిరించిన టార్పాలిన్లు ఎక్కడైనా ఉంటే వెంటనే వాటిని ఎర్రిగెడ్డ దగ్గరున్న ఎస్‌టీపీ వద్ద పడేయాలి. వినియోగించకూడదు.

- నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారా? లేదా? అని వారానికి ఒకసారి పోర్టు అధికారులు, పోర్టు వినియోగదారులతో కలిసి సంయుక్త తనిఖీలు చేసి, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. జరిమానాలు వేయాలి. ఇక తప్పదనుకుంటే లీజు రద్దు చేయాలి.

- పోర్టులో సరుకుల నుంచి దుమ్ము, ధూళి చెలరేగకుండా వినియోగదారులే అవసరమైనన్ని నీటి ట్యాంకర్లను తెప్పించి పిచికారీ చేయాలి. స్టాక్‌ యార్డుల్లో ఏర్పాటు చేసిన స్ర్పింకర్ల ఎత్తుకు మించి సరకు నిల్వ చేయకూడదు.

- యార్డుల నుంచి సరకును లారీల్లో రవాణా చేసేటపుడు ఆ వాహనం బ్రిమ్‌ లెవెల్‌ (బాడీ ఎత్తు) వరకే సరకు ఉండాలి. దానిని టార్పాలిన్‌తో కవర్‌ చేయాలి. ఉల్లంఘిస్తే రూ.5 వేలు జరిమానా వేయాలి.

- సరకు లారీలను నిర్దేశించిన పార్కింగ్‌ ఏరియాలో తప్పితే ఎక్కడైనా రహదారుల పక్కన పార్కింగ్‌ చేస్తే జరిమానా వేయాలి.

ఈ నిబంధనలతో పోర్టు అధికారులు వినియోగదారులు, వ్యాపారులకు సర్క్యులర్‌ జారీ చేశారు. కానీ అందులో పేర్కొన్న విధంగా తనిఖీలు చేయడం లేదు. యథా ప్రకారం వ్యాపారులు సరకులను గాలికి వదిలేస్తున్నారు. నిషేధించిన తెల్లటి బియ్యం సంచులకు కుట్లు వేసి టార్పాలిన్లుగా వాడుతున్నారు. లారీలు కూడా బ్రిమ్‌ లెవెల్‌ దాటి లోడింగ్‌ చేస్తున్నారు. పోర్టు ట్రాఫిక్‌ విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్లనే నిబంధనలు అమలు కావడం లేదని, కాలుష్యం అదుపులోకి రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Aug 11 , 2026 | 01:20 AM