పెరిగిన భూగర్భ జలాలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:25 AM
తుఫాన్ల కారణంగా భారీవర్షాలు కురవడంతో నగరంలో సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య భూగర్భ జలాలు పెరిగాయి.
వాయుగుండం, తుఫాన్ల ప్రభావంతో గడచిన రెండు నెలలుగా అడపాదడపా భారీవర్షాలు
ఆరిలోవలో 15.05 మీటర్లు, ఎండాడలో 12.86 మీటర్లు, మధురవాడలో 14.49 మీటర్ల మేర పెరిగిన జలాలు
సెప్టెంబరుతో పోల్చితే గణనీయమైన వృద్ధి
19, 20 తేదీల్లో మళ్లీ భారీ వర్షసూచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తుఫాన్ల కారణంగా భారీవర్షాలు కురవడంతో నగరంలో సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య భూగర్భ జలాలు పెరిగాయి. మూడు నెలల క్రితంతో పోల్చి చేస్తే ఎండాడలో సుమారు 17 మీటర్లు, ఆరిలోవలో 14, మధురవాడలో 13 మీటర్ల మేర పెరిగాయి. వర్షాలకు రిజర్వాయర్లు నిండడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి కూడా తగ్గింది.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నగరంలో నీటి ఎద్దడి తలెత్తింది. అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో తాగునీటికి కటకటలాడాల్సి వచ్చింది. అటువంటి తరుణంలో సెప్టెంబరు మూడో వారంలో వాయుగుండంతో భారీవర్షాలు కురిశాయి. ఆ తరువాత అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చిన రెండు తుఫాన్‌లతో భారీ నుంచి అతిభారీవర్షాలు, అక్కడక్కడా కుంభవృష్టి కురిసింది. దీంతో ఆరిలోవలో సెప్టెంబరు 25వ తేదీన 31.12 మీటర్లకు పడిపోయిన భూగర్భ జలాలు, అక్టోబరు 25వ తేదీన 17.97 మీటర్లకు, నవంబరు ఆరో తేదీ నాటికి 15.05 మీటర్లకు చేరుకున్నాయి. ఆగస్టు నెలలో అయితే ఆరిలోవలో భూగర్భ జలాలు 35.23 మీటర్లకు పడిపోయాయి. ఒక వాయుగుండం, రెండు తుఫాన్లతో భూగర్భ జలాలు దాదాపు 20 మీటర్లపైకి వచ్చాయి. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టులో ఎండాడలో 30.94, మధురవాడలో 27.24 మీటర్లకు మట్టాలు పడిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వర్షాలు కురవడంతో ఎండాడలో సెప్టెంబరు నెలాఖరు నాటికి 25.04 మీటర్లు, అక్టోబరు 25వ తేదీన 19.17 మీటర్ల వరకు జలాలుపైకి వచ్చాయి. ఈ నెల ఆరో తేదీ నాటికి ఎండాడలో 12.86 మీటర్లకు, మధురవాడలో 14.49 మీటర్లకు చేరుకున్నాయి. ఆగస్టు నెలతో పోల్చితే ఎండాడలో దాదాపు 18 మీటర్లు, మధురవాడలో 13 మీటర్ల వరకు జలాలు పెరిగాయి. ఇంకా నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు ఆశాజనకంగా ఉన్నాయి. ముడసర్లోవ, శివారున మేహాద్రిగెడ్డ, గంభీరం రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గింది. ఈనెల 20వ తేదీన ఉత్తరకోస్తాలో మరో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండడంతో 19, 20 తేదీల్లో నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో నగరంలో భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వేసవిలో నగరంలో నీటికి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చునని నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ప్రాంతం ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు
ఆరిలోవ 35.23 31.12 7.97 15.05
ఎండాడ 30.94 25.04 19.17 12.86
మధురవాడ 27.24 28.58 17.40 14.49
సెంట్రల్‌పార్కు 16.04 14.65 12.78 10.79
శివాజీపాలెం 16.74 11.23 8.7 3.87
కణితి 10.16 9.37 13.01 6.92