Share News

పెరిగిన విద్యుత్‌ వినియోగం

ABN , Publish Date - May 23 , 2026 | 12:17 AM

ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఏజెన్సీలో గతంలో పెద్దగా ఎండల ప్రభావం ఉండేది కాదు. కాని ఈఏడాది అందుకు భిన్నంగా ఎండలు తీవ్రం కావడంతో ఏజెన్సీలోనూ ఫ్యాన్ల వినియోగం క్రమంగా పెరిగింది. ఫలితంగా విద్యుత్‌ వినియోగం రోజుకు మూడు మెగావాట్లు పెరిగింది.

పెరిగిన విద్యుత్‌ వినియోగం

రోజుకు మూడు మెగావాట్లు అదనంగా వాడకం

వేసవి ఎండలే కారణం

మన్యంలో విద్యుత్‌ కోతల్లేవు

పాడేరు, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాధారణంగా రోజుకు 33 మెగావాట్ల విద్యుత్‌ను సగటున వినియోగిస్తారు. గత వారం నుంచి వినియోగం పెరగడంతో రోజుకు 36 మెగావాట్లు వాడుతున్నారు. అంటే రోజుకు మూడు మెగావాట్ల విద్యుత్‌ వినియోగం పెరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే జిల్లా మొత్తం గిరిజన ప్రాంతం కావడంతోపాటు ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో విద్యుత్‌ వినియోగం పెద్దగా లేని పరిస్థితి. జిల్లాలోని పదకొండు మండలాల్లో 1 లక్షా 35 వేల 538 మంది విద్యుత్‌ వినియోగదారులున్నారు. జిల్లా కేంద్రం పాడేరు, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, లాడ్జీలు, రిస్టార్టులు ఉండడంతో ఈ మూడు ప్రాంతాల్లో ఒక మోస్తరుగా విద్యుత్‌ వినియోగం ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో అత్యంత సాధారణంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

పవర్‌ కట్‌లకు ఏజెన్సీ మినహాయింపు

ఏజెన్సీలో విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉండడంతో ఆది నుంచి ఇక్కడ ఎటువంటి పవర్‌ కట్‌ అమలు చేయడం లేదు. చివరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా, అనాధికారికంగా కోతలున్న సందర్భాల్లోనూ గిరిజన ప్రాంతానికి మినహాయింపు ఉండేది. అప్పటి నుంచి అదే సంప్రదాయం కొనసాగుతున్నది. భారీ వర్షాలు, ప్రకృతి విపత్తులతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడం మినహా కోతల ఊసే లేకపోవడంతో ఏజెన్సీలోని వినియోగదారులు ఊరట చెందే విషయం.

Updated Date - May 23 , 2026 | 12:17 AM