పెరిగిన విద్యుత్ వాడకం
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:09 AM
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బయట తిరగలేని విధంగా వాతావరణం మారిపోయింది.
ఎండలు మండిపోతుండడమే కారణం
విశాఖ సర్కిల్‌లో రోజుకు సగటు వినియోగం 18 మిలియన్ యూనిట్లు
ఈ నెల 11న 20 మిలియన్ యూనిట్లు క్రాస్
మిగిలిన రోజుల్లోనూ 19 మిలియన్ యూనిట్లుపైనే
వచ్చే నెలలో మరింత పెరిగే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బయట తిరగలేని విధంగా వాతావరణం మారిపోయింది. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా ఒకటే ఉక్కపోత. అందుబాటులో ఉంటే ఏసీ లేదంటే కూలర్. ఇవేమీ లేకపోతే ఫ్యాన్ అయినా తప్పనిసరిగా వాడాల్సి వస్తోంది. దీంతో విద్యుత్ వినియోగం క్రమంగా అధికమవుతోంది. విద్యుత్ లోడ్ డిమాండ్ కూడా పెరుగుతోంది.
విశాఖపట్నం సర్కిల్‌లో పది లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరంతా కలిసి రోజుకు సగటున 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. అదే మే నెల ఎండలైతే ఈ డిమాండ్ 20 మిలియన్ యూనిట్ల నుంచి 22 మిలియన్ యూనిట్ల వరకు పెరుగుతుంది. ఇది ఏప్రిల్ నెలే. అయినా ఎండలు మండిపోతున్నాయి. దాంతో విద్యుత్ వినియోగమూ ఆ స్థాయిలో కనిపిస్తోంది. ఈ నెల 11వ తేదీన అంటే శనివారం 20 మిలియన్ యూనిట్లు దాటేసింది. ఈ నెలలో ఇప్పటివరరకూ అదే అత్యధిక వినియోగం కావడం గమనార్హం. అదేవిధంగా ఈ 9, 10 తేదీల్లో కూడా ఇంచుమించుగా విద్యుత్ వినియోగం అలాగే నమోదైంది. 9న 19.384 మి.యూ., 10న 19.991 మి.యూ. వాడేశారు. మళ్లీ 12వ తేదీన అంటే ఆదివారం కూడా 19.11 మి.యూ. కాల్చేశారు. ఈ క్రమంలో విద్యుత్ డిమాండ్ 847 మెగావాట్ల నుంచి ఏకంగా 990 మెగావాట్లకు చేరింది. ఇంకో రెండు రోజులు ఆగితే వేయి మెగావాట్లకు చేరుతుంది.
జోన్-2లోనే అధిక వినియోగం
ఈపీడీసీఎల్ అధికారులు పరిపాలనా సౌలభ్యం కోసం విశాఖపట్నం (జిల్లా) సర్కిల్‌ను మూడు జోన్లుగా విభజించారు. జోన్-1లో మహారాణిపేట, జగదాంబ, ఆశీల్‌మెట్ట, సీతమ్మధార, మద్దిలపాలెం తదితర ఏరియాలు, జోన్-2లో కంచరపాలెం, మర్రిపాలెం, ఎన్‌ఎస్‌టీఎల్, ఆటోనగర్, కూర్మన్నపాలెం, వడ్లపూడి, పెదగంట్యాడ, జోన్-3లో మధురవాడ, కొమ్మాది, పీఎంపాలెం, సాగర్‌నగర్, ఆరిలోవ, పెందుర్తి, వేపగుంట, ఆనందపురం, భీమిలి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు జోన్-2లోనే రోజుకు 11 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. జోన్-1లో సగటున రోజుకు 3 మి.యూనిట్లు, జోన్-3లో రోజుకు సగటున 5 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు.
ఇంకా వినియోగం పెరుగుతుంది
శ్యాంబాబు, ఎస్‌ఈ, విశాఖ సర్కిల్.
విద్యుత్ వినియోగం ప్రస్తుతం కొంచెం మాత్రమే పెరిగింది. మే నెల వస్తే డిమాండ్ ఇంకా పెరుగుతుంది. రోజుకు 22 మిలియన్ యూనిట్లు దాటుతుంది. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం.
ఏప్రిల్ నెల విద్యుత్ వినియోం
--------------------------
తేదీ వినియోగం
----------------------------
1 17.255 మి.యూనిట్లు
2 18.832 మి.యూనిట్లు
3 18.581
4. 18.502
5 18.699
6. 19.525
7. 19.229
8. 19.020
9. 19.384
10. 19.991
11. 20.490
12. 19.114
------------------------------------