Share News

అసంపూర్తిగా రోడ్లు

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:28 AM

జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పలు రహదారుల అభివృద్ధి పనులు తారు సమస్యతో పడకేశాయి. మెటర్‌ పరిచి, రోలింగ్‌ చేసి వదిలేయడంతో ఆయా రహదారులు రాళ్లు తేలిపోయి వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అసంపూర్తిగా రోడ్లు

కొండెక్కిన తారు ధరతో పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు

నాలుగైదు నెలల నుంచి ఇదే పరిస్థితి

రాళ్లు తేలి దారుణంగా తయారైన రహదారులు

వాహనదారుల తీవ్ర ఇక్కట్లు

వర్షాలు మొదలైతే పరిస్థితి మరింత తీవ్రతరం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పలు రహదారుల అభివృద్ధి పనులు తారు సమస్యతో పడకేశాయి. మెటర్‌ పరిచి, రోలింగ్‌ చేసి వదిలేయడంతో ఆయా రహదారులు రాళ్లు తేలిపోయి వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియాలో ఫిబ్రవరి నుంచి ఇటీవల వరకు జరిగిన యుద్ధం కారణంగా తారు దిగుమతికి ఆటంకం కలగడం, ధర విపరీతంగా పెరిగిపోవడంతో ఆర్‌అండ్‌బీ పరిధిలో చేపట్టిన రోడ్ల పనులు రెండు, మూడు నెలల క్రితమే ఆగిపోగా, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం చేపట్టిన రహదారుల పనులు సైతం ఇటీవల నిలిచిపోయాయి. టెండర్లు ఖరారైన సమయంలో తారు, ఇతర రోడ్డు నిర్మాణ సామగ్రి ధరలకు, ప్రస్తుతం వున్న ధరలకు భారీ వ్యత్యాసం ఉండడంతో గిట్టుబాటు కాదంటూ కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. జిల్లాలో 2025-26లో మొత్తం 26 రోడ్లను 45.96 కిలోమీటర్ల మేర తారుతో అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. వీటిల్లో 12 పనులకు టెండర్లు పూర్తికాలేదు. మిగిలిన రోడ్లకు ఈ ఏడాది మార్చి కన్నా ముందే పనులు మొదలుపెట్టినప్పటికీ ఇంతవరకు 8.95 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. తారు, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగినందున పనులు కొనసాగించలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఆర్‌అండ్‌బీ రోడ్లకు తారు కొరత ఉందని, పీఆర్‌ శాఖ ముందుగానే తారు నిల్వ చేయడంతో పనులకు ఆటంకం వుండదని భావించారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. సగం పనులు పూర్తయ్యే సరికి తారు నిల్వలు అయిపోవడంతో పనులు కొనసాగించలేమని కాంట్రాక్టర్లు భీష్మించుకున్నారు.

బుచ్చెయ్యపేట మండలం రాజాం నుంచి తురకలపూడి వరకు తారు రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోయాయి. రావికమతం, రోలుగుంట మండలాల పరిధిలోని గిరిజన గ్రామాలకు రహదారుల కోసం రూ.2.66 కోట్లు మంజూరయ్యాయి. గత ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ పనులు ఇంతవరకు పూర్తికాలేదు. ఇందుకు తారు ధర పెరగడమే కారణమని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పలుచోట్ల రోడ్లను తవ్వి, మెటల్‌ పరిచి రోలింగ్‌ చేసి వదిలేయడంతో రాళ్లు తేలిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలు, ఆటోల టైర్లు పాడైపోతున్నాయి. వర్షాల జోరు ప్రారంభమైతే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అసంపూర్తి రహదారులతో ఆయా గ్రామాలకు అంబులెన్స్‌ వాహనం సైతం వెళ్లే పరిస్థితి లేదు. పంచాయతీరాజ్‌ రహదారుల పనులు ఆగిపోవడంపై ఆ శాఖ ఈఈ జగదీశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. తారుతోపాటు ఇతర మెటీరియల్‌ ధరలు పెరగడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారని, ఆయా రహదారుల పరిస్థితిపై పీఆర్‌ కమిషనర్‌కు నివేదిక అందజేశామని చెప్పారు.

ఫొటోరైటప్స్‌ః 14సీడీఎం2 చోడవరం సమీపంలో రోడ్డు మొత్తం ఛద్రమై రాళ్లు తేలిన దృశ్యం

14 సీడీఎం3: కొద్దిపాటి వర్షం కురిసినా అంభేరుపురం వద్ద పరిస్థితి.. ప్రదాన రహదారి దుస్థితి

14సీడీఎం4 గోవాడ వద్ద ఒకవైపు పూర్తిగా పాడైన రహదారి

వాయిదాలతో సరి..

ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని చోడవరం- వెంకన్నపాలెం రోడ్డు

గడువు పొడిగించుకుంటూ వస్తున్న కాంట్రాక్టర్‌

పనులు మాత్రం మొదలుకాని వైనం

గోతులు, రాళ్లు, దుమ్ముధూళితో జనం అవస్థలు

చోడవరం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): దూరం కేవలం నాలుగు కిలోమీటర్లు... కానీ అడుగడుగునా గోతులే.. ఇదీ చోడవరం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి వెళ్లే మార్గంలో వెంకన్నపాలెం వరకు ప్రధాన రహదారి దుస్థితి. కీలకమైన బీఎన్‌ రోడ్డులో భాగమైన చోడవరం-వెంకన్నపాలెం మధ్య వాహనదారుల పాట్లు వర్ణనాతీతం.

చోడవరం- పాడేరు మార్గంలో గౌరీపట్నం జంక్షన్‌ నుంచి వడ్డాది మీదుగా మాడుగుల మండలం తాటిపర్తి వరకు ఆర్‌అండ్‌బీ రహదారి చాలా వరకు బాగానే వున్నప్పటికీ చోడవరం- వెంకన్నపాలెం మధ్య అత్యంత దారుణంగా తయారైంది. గోతులు ఏర్పడి, రాళ్లు లేచిపోయి వాహనాలు వెళుతున్నప్పుడు దుమ్ము, ధూళి ఎగిసిపడుతున్నది. దీంతో వాహనదారులు, ప్రయాణికులతోపాటు రహదారికి ఇరువైపులా నివాసం వుంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా.. గోతుల్లో నీరు చేరుతున్నంది. వాహనదారులు ఏ గొయ్యి ఎంత లోతు వుందో అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. వైసీపీ హయాం నుంచే ఈ రహదారి అధ్వానంగా వుండగా, కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రోడ్డు పరిస్థితి మెరుగుపడలేదు. బీఎన్‌ రోడ్డు అభివృద్ధికి న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులు మంజూరుకాగా, కాంట్రాక్టర్‌తో పనులు చేయించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు న్యాయవాదులు కోర్టు కేసులు వేసినా, జడ్జిలు ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చినా, కాంట్రాక్టర్‌తో పనులు మాత్రం చేయించలేకపోతున్నారు. రోడ్డు నిర్మాణ పనులను ఈ ఏడాది మార్చినాటికి పూర్తి చేయాలని గడువు ఇచ్చిన ప్రభుత్వం.. దీనిని మరో ఆరు నెలలు పొడిగించింది. ఇందులో ఇప్పటికే రెండున్నర నెలలు పూర్తయ్యాయి. కానీ రోడ్డు నిర్మాణ పనుల్లో ఎటువంటి కదలిక లేదు. వర్షం పడితే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని, కనీసం గోతులు అయినా కల్పించి తాత్కాలిక ఉపశమనం కలిగించాలని వాహనదారులు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:29 AM