Share News

ఆరేళ్ల నుంచి అసంపూర్తిగానే..

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:55 AM

మండలంలోని పలు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు ఏళ్ల తరబడి అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

ఆరేళ్ల నుంచి అసంపూర్తిగానే..

అందుబాటులోకి రాని అంగన్‌వాడీ భవనాలు

చాలీచాలని అద్దె భవనాలతో అవస్థలు

పరవాడ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని పలు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు ఏళ్ల తరబడి అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. సొంతగూడు ఒనగూరకపోవడంతో ఆయా కేంద్రాలను అద్దె భవనాల్లో, అరకొర వసతులతో నిర్వహిస్తున్నారు. దీనివల్ల సిబ్బందితోపాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు.

తెలుగుదేశం హయాంలో 2017వ సంవత్సరంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌, ఎస్‌డీపీ, ఐసీడీఎస్‌, గ్రామ పంచాయతీల నిధులతో మండలంలోని పలు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని సంకల్పించింది. స్థలాలు సమకూర్చిన తరువాత అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. ఇందులో రూ.5 లక్షలు ఉపాధి హామీ పథకం నుంచి, ఎస్‌డీపీ నిధులు రూ.2.5 లక్షలు, ఐసీడీఎస్‌ నిధులు రూ.2.5 లక్షలు, గ్రామ పంచాయతీల నిధులు రూ.50 వేలు వున్నాయి. 2019 ఏప్రిల్‌ నాటికి భవనాల నిర్మాణ పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ హయాంలో చేపట్టిన అంగన్‌వాడీ కేంద్రాల భవనాల పనులకు బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు మిగిలిన పనులు చేయకుండా వదిలేశారు. వైసీపీ అధికారంలో వున్న ఐదేళ్ల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆయా కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇవి ఇరుకుగా వుండడంతో సిబ్బంది, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఆటలు ఆడుకోవడానికి సరిపడ వసతి లేదు.

అసంపూర్తి భవనాలు ఇవే..

మండలంలోని వివిధ గ్రామాల్లో మొత్తం 13 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు అసంపూర్తిగా వున్నాయి. వీటిలో రావాడ పంచాయతీ రేఖవానిపాలెం, గొల్లగుంట, భరణికం పంచాయతీ బాపడుపాలెం, గొర్లెవానిపాలెం, పెదముషిడివాడ పంచాయతీ పచ్చికోరువానిపాలెం, నక్కవానిపాలెం, కన్నూరు పంచాయతీ మామిడివానిపాలెం, నాయుడుపాలెం పంచాయతీ మెట్టపాలెం, పాత రాజన్నపాలెం, వాడచీపురుపల్లి పంచాయతీ పోలిరెడ్డిపాలెం, విస్సన్నపేట, కలపాక పంచాయతీ గొల్లలపాలెం వున్నాయి. జిల్లా అధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణ పనులు పూర్తిచేయించి అందుబాటులోకి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jun 03 , 2026 | 12:55 AM