అసంపూర్తిగా అంగన్‌వాడీ భవనాలు
ABN , Publish Date - May 20 , 2026 | 12:24 AM
మండలంలోని ఈదటం, పాయకరావుపేట ఇందిరా కాలనీ, పాల్మన్‌పేట, కొర్లయ్యపేట, తదితర గ్రామాల్లో ఆరు అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు సుమారు దశాబ్ద కాలం నుంచి అసంపూర్తిగా వుండిపోయాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రారంభించకుండానే శిథిలావస్థకు చేరుకునేలా వున్నాయి. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి.
పదేళ్లయినా అందుబాటులోకిరాని వైనం
టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరు
ఆరు కేంద్రాలకు ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున కేటాయింపు
నిధులు చాలవంటూ మధ్యలో పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు
పాయకరావుపేట రూరల్, మే 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఈదటం, పాయకరావుపేట ఇందిరా కాలనీ, పాల్మన్‌పేట, కొర్లయ్యపేట, తదితర గ్రామాల్లో ఆరు అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు సుమారు దశాబ్ద కాలం నుంచి అసంపూర్తిగా వుండిపోయాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రారంభించకుండానే శిథిలావస్థకు చేరుకునేలా వున్నాయి. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తరువాత కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. శ్లాబ్, గోడలకు ప్లాస్టరింగ్ వంటి పనులు పూర్తయిన తరువాత మిగిలిన విద్యుత్తు, ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఫర్నిచర్, పెయింటింగ్ వంటి పనులకు నిధులు చాలని పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంట్రాక్టర్లు మిగిలిన పనులు పూర్తిచేయకుండా వదిలేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులు పూర్తిచేయించకుండా వృథాగా వదిలేసింది. భవనాలు వినియోగంలోకి రాకపోవడంతో చుట్టూ తప్పలు పెరిగిపోయాయి. కిటికీలకు అమర్చిన ఇనుప గ్రిల్స్ తుప్పుపట్టాయి. రాత్రిపూట మందుబాబులకు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఈ భవనాలు అడ్డాగా మారాయని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఆయా అంగన్‌వాడీ కేంద్రాలను చాలీచాలని వసతితో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించి, అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులు పూర్తిచేయించి, వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.