హ్యాష్ ఆయిల్ వైపు మొగ్గు
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:55 AM
గంజాయి ఆకుల నుంచి తయారు చేసే ద్రవ రూప గంజాయి (హ్యాష్ ఆయిల్) రవాణా చాపకింద నీరులా సాగిపోతున్నది. ఎండు గంజాయిని తరలించడం కంటే ద్రవ రూపంలో తీసుకెళ్లడం సులభంగా ఉండడంతో స్మగ్లర్లు హ్యాష్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కిలో చొప్పున ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి, ఏవోబీ నుంచి జిల్లా మీదుగా తరలిస్తున్నారు. ఒడిశా సరిహద్దు గ్రామాల్లో కిలో రూ.30 వేలు నుంచి రూ.50 వేలు ఉండే హ్యాష్ ఆయిల్ ధర... మైదాన ప్రాంతానికి వచ్చేసరికి రూ.లక్ష పలుకుతున్నది. రాష్ట్ర సరిహద్దులు దాటితే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతున్నది.
పంథా మార్చిన గంజాయి స్మగ్లర్లు
ద్రవ రూప గంజాయి రవాణాకు ప్రాధాన్యం
పోలీసుల తనిఖీల్లో చిక్కకుండా సులువుగా తరలింపు
చాపకింద నీరులా సాగుతున్న రవాణా
నర్సీపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గంజాయి ఆకుల నుంచి తయారు చేసే ద్రవ రూప గంజాయి (హ్యాష్ ఆయిల్) రవాణా చాపకింద నీరులా సాగిపోతున్నది. ఎండు గంజాయిని తరలించడం కంటే ద్రవ రూపంలో తీసుకెళ్లడం సులభంగా ఉండడంతో స్మగ్లర్లు హ్యాష్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కిలో చొప్పున ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి, ఏవోబీ నుంచి జిల్లా మీదుగా తరలిస్తున్నారు. ఒడిశా సరిహద్దు గ్రామాల్లో కిలో రూ.30 వేలు నుంచి రూ.50 వేలు ఉండే హ్యాష్ ఆయిల్ ధర... మైదాన ప్రాంతానికి వచ్చేసరికి రూ.లక్ష పలుకుతున్నది. రాష్ట్ర సరిహద్దులు దాటితే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతున్నది.
అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆనుకొని వున్న ఒడిశా రాష్ట్రంలోని గ్రామాల్లో హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్నట్టు అనకాపల్లి జిల్లా పోలీసులు చెబుతున్నారు. తమిళనాడు, కేరళం రాష్ట్రాలకు చెందిన గంజాయి స్మగ్లర్లు.. ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్ పరిధి జాంబ, రోళ్లగెడ్డ, ఇసుకబంద, బోడపర, సురకుబంద ప్రాంతాల్లో ప్రత్యేక యంత్రాల సహాయంతో హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్నారు. 20 కిలోల పచ్చి గంజాయిని క్రషింగ్ చేస్తే ఒక కిలో హ్యాష్ ఆయిల్ లభిస్తుంది. ప్రత్యేక పనిముట్లు, యంత్రాలతో దీనిని తయారు చేస్తున్నారు. రంధ్రాలు ఉన్న చిన్న డ్రమ్ములో గంజాయిని ఉంచి, పైనుంచి ఐరన్ ప్లేటుతో ఒత్తిడి ఇస్తారు. దీంతో గంజాయి ద్రవం బయటకు వస్తుంది. దీనిని ప్రెషర్ కుక్కర్‌లో పోసి ఆవిరి రూపంలో బయటకు వచ్చే వరకు బాగా మరగ బెడతారు. ప్రెషర్ కుక్కర్ సేఫ్టీ వాల్వ్‌కి ఒక పైపు బిగించి దాన్నించి ఆవిరి రూపంలో బయటకు వచ్చే ద్రవాన్నే హ్యాష్ ఆయిల్ అంటున్నారు.
హ్యాష్ ఆయిల్ తరలించడం సులభం
ఎండు గంజాయి కన్నా.. ద్రవ రూపంలో వున్న గంజాయి (హ్యాష్ ఆయిల్) తరలించడం సులువుగా స్మగ్లర్లు భావిస్తున్నారు. ఉదాహరణకు వంద కిలోల గంజాయి తరలించాలంటే.. రెండు కిలోల చొప్పున 50 పొట్లాలు కట్టాలి. తర్వాత వాటిని రెండు, మూడు బస్తాల్లో వేసి ప్రత్యేక వాహనంలో తరలించాలి. పోలీసుల కదలికలను గమనిస్తూ సమాచారం ఇవ్వడానికి వాహనం ముందు, ముందు వెనక పైలట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదే హ్యాష్ ఆయిల్ అయితే సులువుగా రవాణా చేయవచ్చు. 100 కిలోల పచ్చి గంజాయిని క్రషింగ్ చేస్తే ఐదు కిలోల హ్యాష్ ఆయిల్ వస్తుంది. కిలో చొప్పున ప్లాస్టిక్ కవర్‌లో పోసి, బ్యాగులో దుస్తుల అడుగున పెట్టుకొని తరలిస్తున్నారు.
నర్సీపట్నం చుట్టుపక్కల గంజాయి స్మగర్లు అధికం
రాష్ట్రంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు నర్సీపట్నం డివిజన్‌లో ఉంటున్నాయి. ఏటిగైరంపేట, రావణాపల్లి, ఎంబీపట్నం, బీబీ పట్నం, పెదపేట, కొండసంత, డౌనూరు, బచ్చంత ప్రాంతాల్లో గంజాయి వ్యాపారులు అధికంగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. చెడు వ్యసనాలు, జల్సాలకి అలవాటు పడిన యువకులు గంజాయి రవాణా వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లా పోలీసులు ఈ సంవత్సరం జనవరి నుంచి ఇంతవరకు ఏడు కేసుల్లో 26 కిలోల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకొని 21 మందిని అరెస్టు చేశారు. దీని విలువ సుమారు రూ.3.12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నర్సీపట్నం పోలీసులు గురువారం హ్యాష్ ఆయిల్ రవాణా చేస్తున్న ప్రేమ జంటను అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కిలోల హ్యాష్ ఆయిల్‌ని స్వాధీనం చేసుకున్నారు.
గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం వద్ద గత నెల 25న ఆటోలో తరలిస్తున్న 14.7 కిలోల హ్యాష్ ఆయిల్‌ని గొలుగొండ ఎస్‌ఐ రామారావు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేశారు. రెండు బైక్‌లు, ఆటోని సీజ్ చేశారు.
ఆరు నెలల క్రితం నర్సీపట్నం రూరల్ పోలీసులు డౌనూరు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేసే క్రమంలో రెండు కిలోల హ్యాష్ ఆయిల్‌ని పట్టుకున్నారు. ఇద్దరు యువకులు హ్యాష్ ఆయిల్ ప్యాకెట్లను అండర్‌వేర్‌లో పెట్టుకొని రవాణా చేస్తుండడం విశేషం.
ఒడిశా నుంచి జిల్లా మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న 12 కిలోల హ్యాష్ ఆయిల్‌ని ఈ నెల 9న తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్, ఏఎస్‌ఆర్ జిల్లా చింతపల్లికి చెందిన ఆటో డ్రైవర్, పెందుర్తికి చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానిని అరెస్టు చేశారు. నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వరకు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక లారీ చొప్పున మారుతూ సినీ ఫక్కీలో హ్యాష్ అయిల్ తరలించారు. కుషాయిగుడ వద్ద తెలంగాణ పోలీసులకు దొరికిపోయారు.