Share News

వదలని వాన

ABN , Publish Date - May 06 , 2026 | 12:53 AM

మన్యాన్ని వర్షం వదలడం లేదు. మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే తాజా భారీ వర్షానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

 వదలని వాన
చింతపల్లి మండలం అన్నవరంలో వర్షం

- కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

పాడేరు, మే 5 (ఆంధ్రజ్యోతి): మన్యాన్ని వర్షం వదలడం లేదు. మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే తాజా భారీ వర్షానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం వరకు ఎండ కాయడం, ఆ తరువాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురవడం సాధారణంగా మారింది. మంగళవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ తీవ్రంగా కాసి ఆ తరువాత జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని ప్రాంతాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తరచూ వర్షాలు కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు. మంగళవారం కొయ్యూరులో 35.1, పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 34.8, అరకులోయలో 33.1, జి.మాడుగులలో 32.0, అనంతగిరిలో 31.2, పెదబయలులో 30.3, హుకుంపేటలో 29.6, ముంచంగిపుట్టులో 29.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అరకులోయలో..

అరకులోయ: మండల పరిధిలో మంగళవారం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కాయగా, మధ్యాహ్నం వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడి జనం ఊరట చెందారు.

సీలేరులో..

సీలేరు: జీకేవీధి మండలం సీలేరు, ధారకొండలో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మద్యాహ్నం మూడు గంటల వరకు ఎండ ఠారెత్తించింది. సాయంత్రం ఆకాశం మేఘామృతమై ఉరుములు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో సీలేరు రోడ్లపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. ధారకొండ, చెక్కలమద్ది, కుమ్మరాపల్లిలో కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో జనం ఇబ్బందులు పడ్డారు.

చింతపల్లిలో..

చింతపల్లి: మండలంలో మంగళవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతకు అల్లాడిన జనం వర్షంతో ఉపశమనం పొందారు.

జీకేవీధిలో...

గూడెంకొత్తవీధి: మండలంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వర్షం పడింది. వర్షానికి ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.

Updated Date - May 06 , 2026 | 12:53 AM