కందికి ప్రోత్సాహం
ABN , Publish Date - Jun 22 , 2026 | 10:58 PM
గిరిజన ప్రాంతంలో కంది పంటను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా తొలిసారిగా వ్యవసాయశాఖ ద్వారా నాణ్యమైన కంది విత్తనాలను శతశాతం రాయితీపై పంపిణీ చేస్తోంది.
సాగు విస్తీర్ణం పెంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు
తొలిసారిగా శతశాతం రాయితీపై విత్తనాలు
1,800 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక
1,250 మినీ కిట్లు రైతులకు పంపిణీ
చింతపల్లి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
గిరిజన ప్రాంతంలో కంది పంటను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా తొలిసారిగా వ్యవసాయశాఖ ద్వారా నాణ్యమైన కంది విత్తనాలను శతశాతం రాయితీపై పంపిణీ చేస్తోంది. 1,800 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు అవసరమైన 1,250 మినీ కిట్ల పంపిణీకి సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతంలో కంది సాగు విస్తీర్ణం పెంపొందించడమే లక్ష్యంగా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో 12 ఏళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు కంది పంటను సుమారు 18 వేల ఎకరాల్లో సాగు చేసేవారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం, అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా క్రమేపీ సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రస్తుతం కేవలం 100 ఎకరాల్లో మాత్రమే కంది పంట సాగు చేస్తున్నారు. కంది పంటకు గిరిజన ప్రాంత నేలలు, వాతావరణం అత్యంత అనుకూలం. అయితే దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడం, తెగుళ్లు, అధిక వర్షపాతం వల్ల రైతులు కాలక్రమేణా కంది సాగుకు దూరమయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతంలో కంది పంట అంతరించిపోయే ప్రమాదం ఉందని కూటమి ప్రభుత్వం గుర్తించింది. కంది పంటకు మార్కెట్‌లో అధిక ధర లభిస్తున్నది. గిరిజన ప్రాంతం రైతులు సేంద్రీయ పద్ధతిలో సాగు చేయడంతో రెట్టింపు ధర లభిస్తుంది. ఈ మేరకు గిరిజన ప్రాంతంలో కంది సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది.
సాగుకు ప్రోత్సాహం
గిరిజన రైతులు ఖరీఫ్ సీజన్‌లో కంది సాగు చేపట్టేందుకు వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే కంది సాగుపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించింది. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో కంది సాగు చేపట్టేందుకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. ఒక్కొక్క రైతు 1.25-1.5 ఎకరాల్లో కంది సాగు చేపట్టేందుకు అవసరమైన మినీ కిట్(నాలుగు కిలోలు) ను అధికారులు పంపిణీ చేస్తున్నారు. రైతులకు విత్తనాలతో పాటు సేంద్రీయ సాగు చేపట్టేందుకు అవసరమైన జీవన ఎరువులు, వేపనూనె అందజేయనున్నారు. విత్తనాలు నాటిన నాటి నుంచి పంట కోతకు వచ్చే వరకు రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని వ్యవసాయశాఖ అందించనున్నది. రైతులు జూన్, జూలై మాసాల్లో నాట్లు వేసుకోవాలి. పొలాల గట్లపై నాట్లు వేసుకోవడం వల్ల అధిక దిగుబడి రావడంతో పాటు ఇతర పంటలకు మేలు జరుగుతుంది. రైతులు కంది సాగు చేసుకోవడం వల్ల ఆదాయంతో పాటు పోషకాహార లోపం సమస్య తీరుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
శతశాతం రాయితీతో విత్తనాల పంపిణీ
గిరిజన రైతులకు శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ఎల్‌ఆర్‌జీ-105 రకం విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. గిరిజన ప్రాంతంలో 5-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నీటి ఎద్దడిని సైతం ఈ రకం తట్టుకుని దిగుబడులనిస్తుంది. తెగుళ్లు పంటను పెద్దగా ఆశించవు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంట కాలం 140-150 రోజులు ఉంటుంది. ఈ రకం కందికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.