జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:33 AM
అనకాపల్లిలో జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తితో కలిసి కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జడ్పీ ప్రత్యేక అధికారిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.
- జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లిలో జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తితో కలిసి కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జడ్పీ ప్రత్యేక అధికారిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి, ప్రజలకు శుభదినమని, గతంలో ఉమ్మడి పరిధిలో సమావేశాలు జరగడం వల్ల జిల్లా సమస్యలపై చర్చించడానికి సమయం తక్కువగా ఉండేదన్నారు. ఇప్పుడు ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పడడంతో అనకాపల్లి సమస్యలన్నింటినీ వివరంగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. జిల్లాకు వచ్చే నిధులను పూర్తిగా అనకాపల్లి జిల్లా అభివృద్ధి పనులకే ఖర్చు చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు సమావేశాలకు విశాఖపట్నం వెళ్లి రావడానికి పాయకరావుపేట, మాడుగుల, నర్సీపట్నం, తదితర ప్రాంతాల సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు అనకాపల్లిలోనే జిల్లా పరిషత్ అందుబాటులోకి రావడం వారికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పాత భవనాలను తొలగించి నాలుగు అంతస్థుల నూతన భవనాన్ని నిర్మించి అనుసంధానించాలన్నారు. ఇందులో జనరల్ బాడీ సమావేశమందిరం, గెస్ట్‌హౌస్‌లు, ఇతర కార్యాలయాలు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నారాయణమూర్తి, అనకాపల్లి డిప్యూటీ సీఈవో ఇ.సందీప్, డీపీవో మంజులవాణి, అనకాపల్లి ఎంపీడీవో ఆశాలత, జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు.