అరకొర వైద్యం
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:13 AM
స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్ర (సీహెచ్‌సీ)లో వైద్యుల కొరత తీవ్రంగా వుంది. దీనివల్ల రోగులకు నిపుణుల వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడంలేదు. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, చీడికాడ, దేవరాపల్లి మండలాల ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం చోడవరం సీహెచ్‌సీకి వస్తుంటారు.
చోడవరం సీహెచ్‌సీలో వైద్య నిపుణుల కొరత
ఏడు పోస్టులకుగాను ఉన్నది ముగ్గురే
బదిలీలతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయని అధికారులు
చోడవరం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్ర (సీహెచ్‌సీ)లో వైద్యుల కొరత తీవ్రంగా వుంది. దీనివల్ల రోగులకు నిపుణుల వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడంలేదు. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, చీడికాడ, దేవరాపల్లి మండలాల ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం చోడవరం సీహెచ్‌సీకి వస్తుంటారు. కానీ వైద్య నిపుణులతోపాటు వైద్య సిబ్బంది కొరత వుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఐదు నెలల క్రితంం సెలవుపై వెళ్లిపోయారు. మరికొందరు వైద్యులు ఇతర ఆస్పత్రులకు బదిలీ అయ్యారు. వీరి స్థానాల్లో ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ముగ్గురు వైద్య నిపుణులు.. గైనికాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, డెంటల్ డాక్టర్ మాత్రమే వున్నారు. ఎనస్థీషియా, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇంకా గ్రేడ్-1 ఫార్మసిస్ట్, రెండు స్టాఫ్ నర్సు పోస్టులు, కార్యాలయ సిబ్బంది పోస్టు ఒకటి ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రిలో వైద్యుల కొరత గురించి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ దేవరపల్లి వెంకట అప్పారావుతోపాటు, సభ్యులు పప్పు శ్రీను తదితరులు ఇటీవల ఇక్కడ నిర్వహించిన ‘ఒక నెల- నాలుగు పర్యటనల’ కార్యక్రమంలో కలెక్టర్‌కు వివరించారు. ఇక అంబులెన్స్ వాహనం వున్నప్పటికీ డ్రైవర్ పోస్టు ఖాళీగా వుంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ తాత్కాలికంగా ఒక డ్రైవర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అతనికి వేతనాలు ఇచ్చేందుకు నిధులు రాకపోవడంతో అంబులెన్స్ నిరుపయోగంగా పడివుంది. దీంతో రోగులు ప్రైవేటు అంబులెన్స్‌లపై ఆధారపడాల్సి వస్తున్నది. కాగా ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.3 కోట్లు కేటాయించింది. ఇటీవల పనులు మొదలుపెట్టారు. కానీ పూర్తిస్థాయిలో వైద్య నిపుణులు లేకపోవడంతో ఆస్పత్రిని అభివృద్ధి చేసినా ప్రయోజనం వుండదని అభిప్రాయపడుతున్నారు.